Share News

డీఎస్సీపై మాట్లాడే జగన్.. మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడరు: మంత్రి పార్థసారథి

ABN , Publish Date - Sep 20 , 2026 | 02:32 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ మద్యం ఘటనలకు బాధ్యత వహించాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై గంటల తరబడి మాట్లాడుతున్న జగన్‌ మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడరని? ఆయన సూటిగా ప్రశ్నించారు.

డీఎస్సీపై మాట్లాడే జగన్.. మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడరు:  మంత్రి పార్థసారథి
AP Minister K Parthasarathi

అమరావతి, సెప్టెంబర్ 20: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ మద్యం ఘటనలకు బాధ్యత వహించాలని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై గంటల తరబడి మాట్లాడుతున్న జగన్‌ మద్యం వ్యవహారంపై ఎందుకు మాట్లాడరని? ఆయన సూటిగా ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్‌ జగన్‌‌కు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఆదివారం రాజధాని అమరావతిలో మంత్రి పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.. మద్యం విక్రయాల్లో పారదర్శకతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.


నాణ్యమైన మద్యం అందించేందుకు ప్రతి దశలో నాణ్యత పరీక్షలు చేపడుతున్నామని వివరించారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ‘ఏపీ ఎక్సైజ్‌ సురక్ష’ను తీసుకువచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 13 రకాల పరీక్షలతో మద్యం నాణ్యత పరిశీలిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గౌడ సోదరులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో రూ.3,200 కోట్ల అక్రమాలు జరిగాయని విమర్శించారు.


మద్యం కుంభకోణానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచే విధివిధానాలు ఖరారయ్యాయని ఆయన చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తులో మద్యం కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించిన అంశాలపై సమాధానం చెప్పాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను డిమాండ్ చేశారు. ఈ కేసులో వాస్తవాలు బయటపెట్టిన అధికారిపై మానసిక స్థితి బాగోలేదంటూ ముద్ర వేయడం సరికాదని పేర్కొన్నారు.


అధికారులను భయపెట్టి అవినీతి విధానాల కోసం లొంగదీసుకున్నారని వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి ఎండగట్టారు. మద్యం దుకాణాల సిబ్బంది నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం మద్యం విక్రయించారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు నో పర్మిషన్: రఘురామ

For More AP News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 02:44 PM