Share News

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలపై కొత్త ఉత్తర్వులు.. ఇకపై 6 జోన్లుగా..

ABN , Publish Date - Apr 20 , 2026 | 08:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లోకల్ క్యాడర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలపై కొత్త ఉత్తర్వులు.. ఇకపై 6 జోన్లుగా..
AP 6 Zones Classification

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఓ నం.45 ద్వారా ఇప్పటికే అమలులో ఉన్న నిర్ణయానికి అధికారికంగా ఆమోదం లభించింది. లోకల్ క్యాడర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కొత్త ఉత్తర్వులను విడుదల చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన 26 జిల్లాల ప్రకారం ఉద్యోగాల కేటాయింపును సవరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


కొత్త మార్గదర్శకాల ప్రకారం, పాత జిల్లాల వ్యవస్థను ఆధారంగా తీసుకుని ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ క్యాడర్లుగా విభజించారు. మొత్తం రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా విభజిస్తూ జిల్లాలను వర్గీకరించారు. స్థానిక అభ్యర్థులకు 95 శాతం వరకు రిజర్వేషన్ అమలు చేయనున్నారు. స్థానికత నిర్ణయానికి 4 సంవత్సరాల చదువు లేదా నివాసాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. చదువు లేని వారికి 4 సంవత్సరాల నివాసాన్ని ఆధారంగా పరిగణిస్తారు. అవసరమైతే 7 సంవత్సరాల నివాసాన్ని కూడా స్థానికతకు ప్రమాణంగా గుర్తించే అవకాశం ఇవ్వనున్నారు.


ఉపాధ్యాయ నియామకాల విషయంలో జిల్లా యూనిట్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే ఈ మార్పులపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే, 60 రోజుల గడువు విధించారు. అయితే కొన్ని విభాగాలకు స్థానిక రిజర్వేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. సచివాలయం, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (HoD), రాష్ట్ర స్థాయి సంస్థలు వంటి వాటికి ఈ రిజర్వేషన్ వర్తించదు. అలాగే రాజధాని ప్రాంతంలోని పోలీస్ పోస్టులకు కూడా స్థానిక రిజర్వేషన్ అమలు చేయరని అధికారులు స్పష్టం చేశారు.

  • జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి

  • జోన్-2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ

  • జోన్-3: పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా

  • జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు

  • జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప

  • జోన్-6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లా.


Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 20 , 2026 | 08:45 PM