Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది: భరత్, మోహన కృష్ణ

ABN , Publish Date - Aug 27 , 2026 | 08:24 PM

ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ స్పష్టం చేశారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది: భరత్, మోహన కృష్ణ

మంగళగిరి, ఆగస్టు 27: ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ స్పష్టం చేశారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను వారు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరికి ప్రజలు తమ సమస్యలు వివరించారు. వాటిని పూర్తిగా తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Mannava-Mohan-Krishna.jpg


తిరుపతి జిల్లాలోని బీఎన్ కండ్రిగ మండలంలో వైసీపీ మాజీ మండల కన్వీనర్ ప్రభుత్వ పోరంబోకు, చెరువులు, కుంటలు, పేదల అసైన్డ్ భూములను ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదుపై వారు స్పందించారు. ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో భూమి హద్దు రాళ్లను తొలగించి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో నకిలీ డీకేటీ పట్టాలతో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ మామిడి తోటను ధ్వంసం చేశారన్న ఫిర్యాదుపై వాస్తవాలను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా పందిపల్లెకు చెందిన చంద్రశేఖర్ కుటుంబం ఆస్తిలో తన వాటా దక్కకుండా అన్నలు మోసం చేశారంటూ ఇచ్చిన అర్జీని వారు పరిశీలించారు. న్యాయపరంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.


TG-And-Mannava.jpg

తెనాలిలో ప్రైవేట్ స్థలాలతో పాటు పంట కాలువను ఆక్రమించి ప్లాట్లుగా విక్రయించారన్న ఫిర్యాదుపై సంబంధిత రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసి సమస్యను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అలాగే మహిళా వేధింపులు, బెదిరింపులు, భూహద్దుల వివాదాలు, లారీ కొనుగోలు వ్యవహారంలో ఆర్థిక నష్టం వంటి సమస్యలపై వచ్చిన అర్జీలను కూడా సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ వివరించారు.


పింఛన్లు, రేషన్, ఇళ్ల నిర్మాణం, వైద్యం, ఉద్యోగాలు, ఆర్థిక సహాయం కోరుతూ వచ్చిన వినతులను కూడా పరిశీలించి అర్హులకు ప్రభుత్వ పథకాలు, సేవలు అందేలా కృషి చేస్తామని అన్నారు. ప్రజల సమస్యలను వినడమే కాకుండా.. వాటికి పరిష్కారం చూపించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్, మన్నవ మోహనకృష్ణ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ: అచ్చెన్నాయుడు

మంగళగిరికి అమరావతి నుంచే తాగునీరు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 08:34 PM