ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ: అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:31 PM
ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఎల్ నినో కంటే పెద్ద విపత్తు వైఎస్ జగన్ అని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 27: ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతినడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగనే కారణమని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆ రోజు ప్రాజెక్టులు కొనసాగించి ఉంటే.. నేడు ఎల్ నినో వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. గురువారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ అని అభివర్ణించారు. ఎల్ నినో కంటే పెద్ద విపత్తు వైఎస్ జగన్ అని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులు గాడిలో పెట్టామని తెలిపారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్.. తన పాలనను గుర్తుపెట్టుకోకుండా మాట్లాడడం బాధగా ఉందన్నారు. ఎల్ నినో పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. సభలో అన్నింటికీ సమాధానాలు చెబుతామని పేర్కొన్నారు.
అసెంబ్లీకి వస్తే ఐదేళ్లలో చేసిన అన్యాయాలను నిలబెట్టి.. చెబుతామంటూ జగన్‌కు స్పష్టం చేశారు. క్రిమినల్ ముసుగులో ఓ రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఇలా ఉన్నాడని.. లేకుంటే ఎక్కడ ఉండే వాడో కూడా తెలియదని జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తే.. ఎవరైనా ఉంటారా? అని వైసీపీ అధినేతను సూటిగా ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
తమ వద్ద కక్ష సాధింపులు ఉండవని కుండబద్దలు కొట్టారు. వైసీపీ హయాంలో బలహీన వర్గాలపై దమనకాండకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన మాయ మాటలు బీసీలు నమ్మరని అన్నారు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్‌ని తగ్గించింది జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీడీపీలో బీసీలకు స్వేచ్ఛ ఉందని అన్నారు. కానీ వైసీపీలో బీసీలకు స్వేచ్ఛ ఉందా? అని వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.
ప్రస్తుతం తాము బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తే.. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్‌పై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను భయపెట్టి, ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఏకగ్రీవాలు అయితే సీట్లు ఇవ్వనంటూ భయపెడుతున్నారని ఆరోపించారు. తిరిగి ఎన్నికలు సాఫీగా జరిగితే తామే గెలుస్తామని వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు.
గొడ్డలి పార్టీ అధినేత ప్రతి పది రోజులకు ఓ సారి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలను అలవోకగా చెప్పేస్తున్నాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా అన్నారు. దీనిని ప్రతి ఒక్కరు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. అయినా దీనిని జగన్ ఆపడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కూటమి పార్టీపై బురద చల్లడం జగన్‌కు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు చెప్పే అబద్దాలను ఎవరైనా నమ్ముతారేమోనని.. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే తాము ముందుకు వస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంగళగిరికి అమరావతి నుంచే తాగునీరు: మంత్రి నారాయణ
ఏబీఎన్ ఎఫెక్ట్.. పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజు రద్దు చేసిన ప్రభుత్వం
Read Latest AP News And Telugu News