‘సాక్షి’పై కేసుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:15 AM
విజయవాడ ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబుపై ఆధారరహిత ఆరోపణలు ప్రచురించినట్లు పేర్కొంటూ సాక్షి దినపత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్‌తో పాటు ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
విజయవాడ పోలీసు కమిషనర్‌పై తప్పుడు కథనం
ప్రభుత్వానికి కమిషనర్ లేఖ, డీజీపీ నివేదిక
ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్, ఇతర బాధ్యులపై కోర్టులో ఫిర్యాదుకు సర్కారు అనుమతి
అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబుపై ఆధారరహిత ఆరోపణలు ప్రచురించినట్లు పేర్కొంటూ సాక్షి దినపత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్‌తో పాటు ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బీఎన్‌ఎ్‌స-2023లోని సెక్షన్ 222(2), 222(4)తో పాటు అఖిల భారత సర్వీసుల(ప్రవర్తనా) నియామాలు-1968లోని రూల్ 17 ప్రకారం సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సమర్థ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఏడాది జూన్ 30న సాక్షి దినపత్రికలో ‘బెజవాడ బాస్ భారీ డీల్’! శీర్షికతో ప్రచురితమైన కథనంలో అద్వికా ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం కేసు దర్యాప్తును రాజశేఖరబాబు ప్రభావితం చేశారని, నిందితులతో అక్రమంగా రాజీ కుదుర్చుకున్నారని, లంచం తీసుకున్నారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆయన పేరును ప్రస్తావిస్తూ తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసినట్లు ప్రభుత్వం జీఓలో పేర్కొంది. ఈ వ్యహారంలో డీజీపీ పంపిన నివేదికతో పాటు పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు సమర్పించిన లేఖను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌తో పాటు విజయవాడ ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.