ఏపీకి రండి.. పెట్టుబడులు పెట్టండి.. సింగపూర్‌లో పెట్టుబడిదారులకు చంద్రబాబు ఆహ్వానం
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:22 PM
సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. లాజిస్టిక్స్, సప్లై చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
YCH లాజిస్టిక్స్ గ్రూప్‌తో చర్చలు
సింగపూర్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ YCH Group హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సప్లై చైన్ నిర్వహణ, లాజిస్టిక్స్ పార్కుల అభివృద్ధి, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు.ఆంధ్రప్రదేశ్‌కు 1,000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉండటం వల్ల లాజిస్టిక్స్ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే కనెక్టివిటీ బలంగా ఉండటంతో రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
హార్టికల్చర్ రంగంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆక్వాకల్చర్‌లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని వివరించారు. వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పారిశ్రామిక, తయారీ రంగాల్లో కూడా పెట్టుబడులకు విశేష అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఏపీని సందర్శించి ప్రభుత్వ విధానాలు, సౌకర్యాలను పరిశీలించాలని YCH ప్రతినిధులను ఆహ్వానించారు.
గూగుల్ క్లౌడ్‌తో డిజిటల్ భాగస్వామ్యంపై చర్చ..
అలాగే గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడుకరణ్ బజ్వాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అభివృద్ధి చేసే అంశాలపై విస్తృత చర్చించారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఇరువురు నిర్ణయించారు. ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగాన్ని పెంచేందుకు గూగుల్ క్లౌడ్ సహకారాన్ని సీఎం కోరారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత శక్తివంతం చేసేందుకు ఆధునిక క్లౌడ్ సాంకేతికతలను వినియోగించే అవకాశాలపై చర్చించారు.యువతకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఏఐ స్కిల్లింగ్, క్లౌడ్ సర్టిఫికేషన్ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాల ఏర్పాటు అంశంపై కూడా చర్చించారు..
గ్రీన్ ఎనర్జీ, సంజీవని ప్రాజెక్టుపై వివరణ
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ రంగంలో సాధిస్తున్న పురోగతిని గూగుల్ క్లౌడ్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న ‘సంజీవని’ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండాలని కోరారు. సింగపూర్ పర్యటనలో జరిగిన ఈ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ఉపాధి అవకాశాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.