గుడివాడలో నగల పేరుతో మోసం.. వైసీపీ నేతపై కేసు నమోదు
ABN , Publish Date - Jul 08 , 2026 | 08:38 AM
నగలు చేయిస్తానని లక్షలు తీసుకుని మోసగించిన కేసులో గుడివాడకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడు వినోద్‌కుమార్‌పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుడివాడ, జులై 8: నగలు చేయిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసి, మోసగించిన కేసులో గుడివాడకు చెందిన వైసీపీ నేత వినోద్‌కుమార్‌పై గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుడివాడలో బంగారు ఆభరణాల దుకాణం నిర్వహించే వినోద్‌కుమార్‌కు, కొండపల్లి ఈశ్వరీదేవి అనే మహిళ ఆభరణాల తయారీ కోసం రూ. 6.05 లక్షలు చెల్లించారు. అయితే, డబ్బులు తీసుకున్నప్పటికీ వినోద్ ఆమెకు నగలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, గుడివాడ టూటౌన్ పోలీసులు వినోద్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు వినోద్‌కుమార్‌కు రాజకీయంగా బలమైన నేపథ్యం ఉంది. ఆయన గుడివాడ నియోజకవర్గ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. వినోద్‌కుమార్‌కు నేరచరిత్ర ఉన్నట్లు సమాచారం. గతంలో జరిగిన పలు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో కూడా ఈయన ప్రమేయం ఉందని, ఆయా కేసుల్లో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా బంగారం పేరిట చేసిన మోసం గుడివాడ రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్‌లో ఫోన్ భద్రతపై విదేశీయురాలి వ్యాఖ్యలు.. వీడియో వైరల్
బొమ్మలా పరుగులు తీస్తున్న రెయిన్ ట్రైన్.. వీడియో వైరల్
For More Viral News And Telugu News