బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం
ABN , Publish Date - Jan 28 , 2026 | 10:58 AM
కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. రవీంద్ర అనే విద్యార్థి కాలేజ్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేపటికే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..
కోనసీమ జిల్లా, జనవరి 28: జిల్లాలోని ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మరణించాడు. మృతుడిని అన్నంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మిదేవిలంక గ్రామానికి చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర(16)గా గుర్తించారు. రవీంద్ర అమలాపురంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఎక్కి కళాశాలకు వెళ్లేందుకు బయలుదేరాడు. బస్ ఎక్కిన కొద్దిసేపటికే టోల్ ప్లాజా వద్ద బస్‌లో నుంచి తల బయటకు పెట్టగా, టోల్‌గేట్ వద్ద ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. విద్యార్థి మృతి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలేజ్‌కు వెళ్లేందుకు బయలుదేరిన తమ కుమారుడు కాసేపటికే ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి...
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
నేడు గద్దెపైకి సారలమ్మ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం
Read Latest AP News And Telugu News