విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
ABN , Publish Date - Jan 28 , 2026 | 09:58 AM
మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ ఇవాళ పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మృతి చెందారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 28: మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్(Ajit Pawar) ఇవాళ(జనవరి 28) పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతోపాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉదయం 8:45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ వయసు 66 సంవత్సరాలు.
కుప్పకూలిన విమానం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తోన్న విమానం బారామతిలో ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలినట్టు తెలుస్తోంది. కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అజిత్ పవార్.. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మొత్తం ఐదుగురు మృతి
కూలిపోయి అగ్నికి ఆహుతైన విమానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తోపాటు, మరో ఇద్దరు సిబ్బంది (ఒక పీఎస్‌ఓ, ఒక సహాయకుడు) మరో ఇద్దరు (పైలట్, కో-పైలట్) మొత్తం ఐదుగురు ఈ చార్టర్ విమానంలో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో ఉన్న ఏ ఒక్కరూ ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడలేదని డీజీసీఏ (పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్) అధికారికంగా ప్రకటించింది.
బలమైన నేత అజిత్ పవార్
అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP - అజిత్ పవార్ వర్గం) అధ్యక్షులు. మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. 2024 డిసెంబరు 5 నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న మహాయుతి ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండేతో కలిసి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు.
ఘటనా స్థలం
ప్రమాదం వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి రక్షణ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సర్వీస్ బృందాలు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం విమాన ప్రమాదంలో చనిపోయారన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇతర నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఈ దుర్ఘటనపై తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఘటనాస్థాలానికి చేరుకుంటున్నారు.
తీరని లోటు
బారామతి నియోజకవర్గం నుంచి బలమైన బేస్ ఉన్న అజిత్ పవార్.. శరద్ పవార్ అన్నయ్య కుమారుడు. రాజకీయంగా చాలా శక్తిమంతమైన వ్యక్తిగా ఎదిగారు. ఆయన మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ లోటు ఏర్పడిందని పలువురు రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. పవార్ మృతితో.. NCP(అజిత్ వర్గం), మహాయుతి కూటమి, బారామతి ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడనుంది.