నేడు గద్దెపైకి సారలమ్మ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం
ABN , Publish Date - Jan 28 , 2026 | 10:44 AM
మేడారం మహాజాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు సాలరమ్మ గద్దెపైకి చేరుకోనున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ములుగు, జనవరి 28: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతరకు(Medaram Jatara) లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నేటి జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి రానున్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గోవింద రాజు, పగిడిద్ద రాజులు కూడా గద్దెలకు చేరుకుంటారు.
రేపు సమక్క రాక..
అలాగే గురువారం(జనవరి 29) సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారు. సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణం కానుంది. మరుసటి రోజు అనగా శుక్రవారం(జనవరి 30) భక్తులు సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజైన శనివారం(జనవరి 31) సాయంత్రం సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర పరిపూర్ణంగా ముగుస్తుంది.
భక్తులతో మేడారం కిటకిట..
మేడారం మహా జాతర తెలంగాణ సంస్కృతి, గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. జనాల గుడారాలతో మేడారం కిటకిటలాడుతోంది. భక్తులు బెల్లం(బంగారం) సమర్పిస్తూ ఆచారాలు పాటిస్తున్నారు. మహాజాతరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ప్రభుత్వం తాజాగా గద్దెలను పునర్నిర్మాణం చేసింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రవాణా, నీరు, వైద్యం, భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
Read Latest Telangana News And Telugu News