Share News

సముద్రంలో గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు క్షేమం

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:51 PM

సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. బెంగాల్‌-ఒడిశా బోర్డర్‌లో మత్స్యకారుల ఆచూకీని మరో బోటు సిబ్బంది గుర్తించారు.

 సముద్రంలో గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు క్షేమం
Konaseema fishermen found

కోనసీమ, ఆగస్టు 26: సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. బెంగాల్‌-ఒడిశా బోర్డర్‌లో మత్స్యకారుల ఆచూకీని మరో బోటు సిబ్బంది గుర్తించారు. గల్లంతైన మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్టు 3న కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిషింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నుంచి IND-AP-E8-MO-135 ‘ముత్యాలమ్మ’ బోటులో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనంతరం వారు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.


తాజాగా పశ్చిమబెంగాల్‌లోని దిగా ప్రాంతం వద్ద మరో బోటు సిబ్బంది.. గల్లంతైన బోటును గుర్తించారు. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇంజిన్‌ చెడిపోవడం వల్లే మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు కొంతకాలంగా కదలలేని పరిస్థితిలో సముద్రంలోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఏడుగురు మత్స్యకారులను గుర్తించిన మరో బోటు సిబ్బంది.. ఇంజిన్ పనిచేయని బోటును మరో బోటుకు కట్టి ఒడ్డుకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 23 రోజుల తర్వాత మత్స్యకారులు క్షేమంగా ఉన్నారనే సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం: మంత్రి అచ్చెన్న

సముద్రంలో గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందన్నారు. జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌, మత్స్యశాఖ జేడీ, ఎఫ్‌డీవోలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, ప‌శ్చిమ బెంగాల్ వెళ్లాల‌ని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ప్రతి చేనేత కార్మికుడికీ ‘నేతన్నల సేవలో పథకం’: మంత్రి సవిత

యువకుడి ఆత్మహత్య.. ప్రియురాలు మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 05:10 PM