Share News

Gangamma: జాతరకు సిద్ధమైన తిరుపతి

ABN , Publish Date - May 06 , 2026 | 01:05 AM

గంగమ్మ వడిబాల కట్టుకుంది. దీంతో జాతర సంబరాలకు, వేషాల సందడికి తిరుపతి సిద్ధమైంది.

Gangamma: జాతరకు సిద్ధమైన తిరుపతి
విశ్వరూప స్తూపానికి వడిబాల, వజ్ర కిరీటంలో మెరిసిపోతున్న గంగమ్మ

తిరుపతి సిటీ, మే 5(ఆంధ్రజ్యోతి): గంగమ్మ వడిబాల కట్టుకుంది. దీంతో జాతర సంబరాలకు, వేషాల సందడికి తిరుపతి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్తూపానికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. అంతకుముందు మూలవిరాట్‌ను అభిషేకించి సర్వాంగ సుందరంగా అలంకరించాక ఆలయ ఛైర్మన్‌ మహేష్‌ యాదవ్‌ ఇతర పాలకమండలి సభ్యులు, అధికార ప్రముఖులతో కలిసి ఊరేగింపుగా సారెను తీసుకుని విశ్వరూప స్తూపం వద్దకు చేరుకుని అభిషేకం తరువాత వడిబాల కట్టారు. అభిషేకించిన పసుపు కోసం భక్తులు ఎగబడ్డారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి,అదనపు కమిషనర్‌ శారదాదేవి, టీడీపీ నేతలు ఆర్సీ మునిృకష్ణ, జేబీ శ్రీనివాస్‌, పులుగోరు మురళి, పెద్ద గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కొత్తవీధి వెంకటేశ్వరస్వామి ఆలయాల ఛైర్మన్లు వేదవతి రాయల్‌, కొండా రాజమోహన్‌, జగదీష్‌, వినోద్‌ రాయల్‌, ఆలయ ఈవో జయకుమార్‌, కూటమి నాయకులు నరసింహాచారి, సీకే రేవతి, నరేంద్రనాద్‌, రాజారెడ్డి,భరణి యాదవ్‌,మునిరామయ్య, ఆళ్వార్‌ మురళి, సునీల్‌ చక్రవర్తి, ఆముదాల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.గంగజాతర సందర్భంగా వేశాలమ్మ, పెద్దగంగమ్మ ఆలయాల్లోనూ విశ్వరూప స్తూపాలకు అభిషేకాలు జరిగాయి.

చాటింపు వేసిన కైకాలవాళ్లు

తిరుపతి గంగజాతరకు మంగళవారం రాత్రి కైకాల కులస్తులు చాటింపు వేశారు.గంగమ్మ జన్మస్థలమైన తిరుపతి రూరల్‌ మండలం అవిలాల గ్రామంలో జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అవిలాల గ్రామ పెద్దలు పూజలు నిర్వహించి పుట్టింటి సారెను తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఛైర్మన్‌ నైనారు మహేష్‌ యాదవ్‌, ఈవో జయకుమార్‌లకు అందించారు. అక్కడినుంచి ఊరేగింపు గంగమ్మ ఆలయానికి సారె చేరింది. దీని వెంబడే స్థానిక కైకాల వారు నగర పొలిమేర్లలో చాటింపు వేశారు. జాతర పూర్తయ్యేంత వరకు నగరంలో నివసించేవారు బయటఊర్లకు వెళ్లి నిద్రించకూడదనేది చాటింపు అర్థమని


పెద్దలు చెబుతుంటారు.

నేటినుంచి వేషాల జాతర

జాతరలో నేటినుంచి వేషాల సందడి ప్రారంభం కానుంది.బుధవారం బైరాగి వేషంతో పాటు పలుచిత్ర, విచిత్ర వేషాలు కూడా భక్తులు ధరిస్తారు. బైరాగులు ఎలావుంటారో చెప్పేదే బైరాగి వేషం. శరీరమంతా నామం కొమ్ము లేదా విభూది పూసుకుంటారు. రేళ్ల కాయల మాలలు మెడలో ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.మహిళలు వేపాకు చీరలు కట్టుకుని, నెత్తిన వేయికళ్ల దుత్తలు పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.

Updated Date - May 06 , 2026 | 01:05 AM