మదనపల్లిలో ఫైళ్ల దహనం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు షాక్
ABN , Publish Date - Mar 09 , 2026 | 08:45 PM
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
న్యూఢిల్లీ, మార్చి 09: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏతోపాటు ఆయన ప్రధాన అనుచరుడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వీరిద్దరికి బెయిల్ ఇచ్చే పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తునకు తాము అడ్డు రాలేమంటూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 20 వేల ఎకరాలకుపైగా భూములకు సంబంధించిన దస్త్రాల దహనం చిన్న విషయమేమీ కాదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో వీరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
అలాగే ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో తాను దేశంలో లేనంటూ కోర్టు దృష్టికి ఒక నిందితుడు తీసుకెళ్లాడు. కుట్ర పన్నడానికి దేశంలోనే ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే విధంగా ఈ కేసులో ఇప్పటికే చాలా మంది నిందితులు బెయిల్‌పై బయటికి వచ్చారన్న నిందితుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కింది కోర్టుకు వెళ్లి.. రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని నిందితులకు ధర్మాసనం సూచించింది.
ఇంత పెద్ద వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ క్రమంలో వీరు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఈ కేసులో ఎ3, ఎ4 నిందితులుగా ఉన్న వంకిరెడ్డి మాధవరెడ్డి. బి మునిరత్నం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. వీరిద్దరిలో ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాజీ పీఏ కాగా.. మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News