Share News

వీల్ చైర్ నుంచి వీర యాత్ర

ABN , Publish Date - Mar 09 , 2026 | 08:05 PM

రోగ్యాన్ని మెరుగు పర్చుకునేందుకు సైకిల్‌ను ఎంచుకున్నారు. క్రమక్రమంగా అదే సైకిల్ తన జీవితంలో భాగమైపోయింది. నేడు సైకిల్‌తోనే దేశాన్ని చుట్టేస్తున్నారీ రావి రమేశ్.

వీల్ చైర్ నుంచి వీర యాత్ర
Ravi Ramesh

సైకిల్‌తో రావి రమేశ్ విజయ యాత్ర

66 ఏళ్ల వయసులోనూ అద్భుతం

జీవితాంతం వీల్ చైర్‌లోనే.. అంటూ వైద్యుల స్పష్టం

మూడు సర్జరీలు జరిగినా మొక్కవోని దీక్షతో ముందుకు..

సైకిల్‌తో సమాజానికి సవాల్

దేశాన్ని చుట్టేసిన దృఢ సంకల్పం

యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న రమేశ్

ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకునేందుకు సైకిల్‌ను ఎంచుకున్నారు. క్రమక్రమంగా అదే సైకిల్ తన జీవితంలో భాగమైపోయింది. నేడు సైకిల్‌తోనే దేశాన్ని చుట్టేస్తున్నారు. మానసిక స్థిరత్వం ఉంటే శారీరక దృఢత్వం సాధించి, వైకల్యాలను అధిగమించ వచ్చని నిరూపించారు. నేటి తరానికి స్పూర్తిగా నిలుస్తున్నారు రావి రమేశ్.


Ravi-Ramesh-2.jpg

విజయవాడలో స్థిర పడిన రావి రమేశ్ బాబు సొంత ఊరు కృష్ణాజిల్లా మోపిదేవి మండలం రావి వారి పాలెం గ్రామం. 2010లో తన 50వ ఏట జరిగిన ప్రమాదంలో రెండు సార్లు మోకాళ్ల సర్జరీ జరిగింది. ఆ తరువాత కొన్నాళ్లకు వెన్నుముక సర్జరీ సైతం చేశారు. దీంతో రావి రమేశ్ నడవలేని స్థితిలోకి వెళ్లారు. బతికినన్నాళ్లు వీల్ చైర్‌లోనే ఉండాలని ఆయనకు వైద్యులు సూచించారు. అదే సమయంలో తనను పరామర్శించేందుకు స్నేహితుడు వచ్చారు. అతడు తనకు హేల్ ది బాడీ హీల్ ది మైండ్ అనే పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకం రమేశ్‌ను ఎంతగానో ఉత్తేజపరిచింది. మానసిక స్థితిని దృఢంగా మార్చుకున్నారు.


Ravi-Ramesh-3.jpg

ఏదో ఒక యాభై ఏళ్ల వయసులో రెండు సార్లు మోకాళ్ల సర్జరీ.. ఒక సారి వెన్నుముక సర్జరీ జరిగితే ఎవరైనా ఏం చేస్తారు?. యూరిన్ పైప్ తొడుక్కుని, జీవితాంతం వీల్ చైర్‌లోనే ఉండాలని వైద్యులు సైతం చేసే సూచన సహజంగానే ప్రతి ఒక్కరినీ కుంగదీస్తుంది.! " జీవితం ఇంకా అయిపోయిందనే భావన మనసును చుట్టేసి నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తాయి.! కానీ అలాంటి దుర్భరమైన పరిస్థితులను తన ధృడ సంకల్పంతో ఓడించిన ధీరుడు.. రావి రమేశ్.


Ravi-Ramesh-4.jpg

ఆధారం పట్టుకుని ఆడుగులో అడుగేయడం మొదలెట్టారు. ఆరు నెలల గడిచే సరిగా నడకలో వేగం పెరిగింది. తన శరీరాన్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకున్నారు. ఇంకా ఎక్కువ నడవాలని నిశ్చయించుకున్నారు. కొన్నాళ్ల తరువాత 40 కిలోమీటర్లు ఆగకుండా నడిచారు. నాలుగేళ్లలో శరీరాన్ని దృఢంగా మార్చుకుని విజయవాడ నుంచి తిరుపతికి కాలినడకన వెళ్లారు. తన సొంతూరుకు వెళ్లిన ప్పుడు.. 70, 80 ఏళ్ల వయసులోని అక్కడి వారు ఆరోగ్యంగా ఉండటానికి కారణం, వారు సైకిల్ తొక్కడమేనని గ్రహించారు. వెంటనే తాను సైకిల్ ఎక్కారు.


Ravi-Ramesh-1.jpg

66 ఏళ్ల వయసులోనూ అద్భుతాలు..

ప్రస్తుతం రమేశ్ వయసు 66 ఏళ్లు. తనను తాను దృఢంగా మార్చుకోవడానికి ఎంచుకున్న సైకిల్ నేడు ఆయన జీవితంలో భాగమైంది. సైకిల్‌పై దేశం మొత్తం చుట్టేయ్యాలంటే బృందంలో చేరాలనే ఉద్దేశంతో యూత్ హాస్టల్స్‌ను సంప్రదించారు. అయితే వయసు పెద్దది కావడంతో.. వారు తిరస్కరించారు. పట్టుదల వదలకుండా డాక్టర్ నుంచి ఫిటినెస్ సర్టిఫికేట్ తీసుకుని కుర్రాళ్లతో పోటీపడుతున్నారు.


ఫ్రాన్ చెందిన ఆడాక్స్ క్లబ్ నిర్వహించే ఫ్రెంచీ పోటీల్లో పాల్గొని విజయం దిశగా రావి రమేశ్ దూసుకెళ్తున్నారు. విజయవాడ -హైదరాబాద్ - విజయవాడ 600 కిలోమీటర్లు, తిరుచ్చి- రామేశ్వరం (ధనుష్కోటి) 600 కిలోమీటర్లు, మనాలి - లబ్లాక్ 500 కిలోమీటర్లు, హైదరాబాద్ - చీరాల 360 కిలోమీటర్లు, తాజాగా కరీంనగర్ - గోదావరిఖని - హైదరాబాద్- కరీంనగర్ 400 కిలోమీటర్లు పూర్తి చేశారు. దీనితో పాటు కేరళ, గోవా రాష్ట్రాలను తన సైకిల్‌తో చుట్టేశారు.


20,700 అడుగుల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ట్రెక్ చేశారు. ఇప్పటికీ ప్రతి రోజూ 40 నుంచి 60 కిలోమీటర్లు సైకిల్ సవారీ చేస్తారు. రానున్న రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇప్పటి వరకు చేసిన కొన్ని యాత్రలకు గానూ సూపర్ రాండోనర్ అవార్డును రావి రమేశ్ అందుకున్నారు.


Ravi-Ramesh.jpg

సంప్రదాయాలు తెలుసుకుంటూ..

వేగంగా నడిచే లారీలు, ట్రావెల్స్ బస్సులు, ట్రక్కులు, గాలి, మంచు, ఎండ, వాన, భయంకరమైన అడవులు, దారి దోపిడిదారులు, రహదారుల ఎత్తు పల్లాలు, సైకిల్ సవారీకి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రాంతాల జీవ వైవిద్యాలు, ప్రజా జీవన శైలి తెలుసుకుంటూ, అందమైన ప్రకృతి ఒడిలో ఆనందంగా ముందుకు సాగడం మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుందని రమేశ్ అంటున్నారు. ధైర్యం, పట్టుదల ఉంటే కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చననేది రమేశ్ వీరగాథ నేటి తరానికి బోధిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం: మంత్రి సవిత

రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 08:29 PM