Tribal Girl Incident: ఏపీలో అమానవీయ ఘటన.. ఏడేళ్ల చిన్నారిపై..
ABN , Publish Date - Jan 04 , 2026 | 08:24 AM
ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి రూరల్ పరిధిలో ఏడేళ్ల గిరిజన బాలికకి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు నాగరాజును తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి, జనవరి4(ఆంధ్రజ్యోతి): తిరుపతి (Tirupati) రూరల్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చాక్లెట్ ఆశ చూపించి ఏడేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి (Tribal Girl Incident) పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నాగరాజును తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్‌కి చెందిన దంపతులు రోజువారి కూలీ పనులకు వెళ్తూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారికి ఏడేళ్ల చిన్నారి ఉంది. ఈ క్రమంలో రోజు వారిగానే కూలీ పనులకు వెళ్లగా.. వారి కుమార్తె ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఓ వ్యక్తి ఏడేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఇంటి లోపలకి తీసుకెళ్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.
పోలీసుల చర్యలు
తిరుచానూరు పోలీసులు ఈ ఘటనపై వెంటనే స్పందించారు. నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం దర్యాప్తు ప్రారంభించారు. బాలికను సురక్షిత స్థలంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. మానసిక, శారీరక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పోక్సో చట్టం కింద దర్యాప్తు పూర్తిగా న్యాయ పరంగా జరుగుతోందని వెల్లడించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
స్థానికుల ఆందోళన..
ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారిపై దాడి, అఘాయిత్యం వంటి ఘటనలు గ్రామాల్లో భయం కలిగిస్తున్నాయని తెలిపారు. చిన్నారులపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
చిన్నారుల భద్రత..
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా గిరిజన గ్రామాల్లో చిన్నారుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. గ్రామాల్లో చిన్నారుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. చిన్నారుల మానసిక, భౌతిక రక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
ల్యాండ్ పూలింగ్ రైతులు అధైర్యపడొద్దు.. అన్ని హామీలు నెరవేరుస్తాం: నారాయణ
Read Latest AP News And Telugu News