Share News

పీ4 కార్యక్రమం ఇచ్చిన తృప్తి మరేదీ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 30 , 2026 | 08:16 PM

మనం మనుషుల కోసం ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.

పీ4 కార్యక్రమం ఇచ్చిన తృప్తి మరేదీ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

తిరుపతి, మార్చి 30: మనం మనుషుల కోసం ఖర్చు చేస్తే ఆ భగవంతుడు మనకు మరింత ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా గొప్ప వ్యక్తి అని.. అలాంటి వారిని నేటి తరంలో గుర్తించి వారికి తోడ్పాటునందిస్తే.. భవిష్యత్తులో ఎంతో తృప్తి కలుగుతుందన్నారు. సోమవారం తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో పీ4 తొలి వార్షికోత్సవంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బంగారు కుటుంబం, మార్గదర్శులతో ఆయన మాట్లాడారు. పూజ చేసేటప్పుడు మార్గదర్శి బాగుండాలని బంగారు కుటుంబం కోరుకోవాలన్నారు.


బంగారు కుటుంబం కూడా మార్గదర్శి కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఎదిగిన వారు.. వారి కుటుంబానికే పరిమితం కాకుండా గివ్ బ్యాక్ టూ సొసైటీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ప్రజలకు సూచించారు సీఎం. అలాంటి సామాజిక బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. సమాజమే మన కుటుంబమని పేర్కొన్నారు. అందరూ బాగుంటేనే మనమూ బాగుంటామని తెలిపారు. చాలామంది వద్ద డబ్బు ఉంటుందని.. దానిని అర్థవంతంగా ఖర్చు చేయాలన్నారు. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని పీ4 మార్గదర్శి పని చేయాలన్నారు. బంగారు కుటుంబాల వద్దకు మీరే మార్గదర్శులే వెళ్లాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.


2025లో ఉగాది రోజున పీ4ను ప్రారంభించామని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. లక్షలాది మంది బంగారు కుటుంబాల జీవితాలకు తోడ్పాటునందించిన మార్గదర్శులకు ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. పీ4 కార్యక్రమం ఇచ్చినంత తృప్తి మరే ఇతర కార్యక్రమమూ ఇవ్వలేదని సీఎం తెలిపారు. ఎన్నో పథకాలు, పింఛన్లు ఇచ్చినా సమాజంలో పేదరికం పోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, చైనాలలో సైతం ఆర్థిక అసమానతలు ఉన్నాయని గుర్తు చేశారు. పీ4 భవిష్యత్తులో పేదరికంలేని సమాజానికి, ఆర్థిక అసమానతలులేని స్వర్ణాంధ్ర 2047 నిజం చేస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. గతంలో ప్రారంభించిన జన్మభూమి ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని గుర్తు చేసుకున్నారు.


పీ4 ఒకసారి ఆర్థిక సాయంచేసి వదిలేసే కార్యక్రమం కాదని సీఎం చంద్రబాబు వివరించారు. ఇదో ఉద్యమం, విప్లవమంటూ అభివర్ణించారు. ఈ సందర్భంగా చంద్రబాబును తమ యానాది కాలనీకి రావాలంటూ ఓ స్థానిక మహిళ ఆహ్వానించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ కాలనీకి వస్తానంటూ ఆమెకు హామీ ఇచ్చారు. వెబ్‌సైట్‌లో బంగారు కుటుంబాన్ని ఎంపిక చేసుకుని మార్గదర్శి తోడ్పడాలని సూచించారు.


ప్రత్యేక అవార్డు ఇచ్చి సమాజంలో మార్గదర్శుల గౌరవం పెరిగేలా చేస్తామని ప్రపంచంలోని తెలుగు వారికి సూచించారు. ఇలాంటి ఉదాత్తమైన పనుల్లో వచ్చే గుర్తింపునకు సాటి లేదన్నారు. జిల్లా.. జిల్లా, నియోజకవర్గం.. నియోజకవర్గం పోటీపడి బంగారు కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. ఇది ప్రపంచానికే ఆదర్శం కావాలని ఈ సందర్భంగా కోరారు సీఎం.


ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్ నిందితుల కస్టడీ కోసం పిటిషన్.. తీర్పు వాయిదా

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి

For More AP News And Telugu News

Updated Date - Mar 30 , 2026 | 08:48 PM