ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి
ABN , Publish Date - Mar 30 , 2026 | 06:11 PM
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి విజ్ఙప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయ శాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ సైతం ఇచ్చామని ప్రభుత్వానికి వివరించారు.
ఉద్యమకారులకు మనం తొలి ప్రాధాన్యం (ఫస్ట్ ప్రయారిటీ) ఇస్తామని భరోసా కూడా ఇచ్చామని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు తమను ప్రశ్నిస్తున్నారని శాసనమండలి వేదికగా ఎమ్మెల్సీ విజయశాంతి వివరించారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి జూన్ 2వ తేదీ నాటికి వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చామని.. అది కూడా ఇంకా నెరవేరలేదని విజయశాంతి చెప్పారు.
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ నెరవేరిస్తే మరో చరిత్ర అవుతుందని.. పట్టించుకోకుంటే చారిత్రక తప్పిదం అవుతుందని విజయశాంతి పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ విజయశాంతి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారు: సి.ఆర్.పాటిల్
కేజీ బంగారాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు: విజయ్ కుమార్
For More TG News And Telugu News