చిత్తూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 22 , 2026 | 07:32 AM
చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు రూరల్ మండలంలోని బంగారెడ్డిపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిత్తూరు జిల్లా, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో మరణించిన వారిని ఒకే కుటుంబానికి చెందిన దామోదర్ (కుటుంబ యజమాని), నిర్మల (భార్య), దిలీప్ (కుమారుడు - 8వ తరగతి విద్యార్థి), శ్రీవిద్య (కుమార్తె - 6వ తరగతి విద్యార్థిని)గా పోలీసులు గుర్తించారు.
ఆత్మహత్యకు గల కారణాలు
భార్య నిర్మల గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. భార్య అనారోగ్యాన్ని చూసి తీవ్ర మనస్థాపానికి గురైన భర్త దామోదర్, కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మొదట తన భార్యకు, ఇద్దరు పిల్లలకు (దిలీప్, శ్రీవిద్య) విషం ఇచ్చాడు. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దామోదర్ సూసైడ్ నోట్..
ఆత్మహత్యకు ముందు దామోదర్ ఒక లేఖ రాసి పెట్టాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదని అందులో స్పష్టం చేశాడు. అంతేకాకుండా, తన ఏటీఎం కార్డులో డబ్బులు ఉన్నాయని, ఆ డబ్బును డ్రా చేసి తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియల ఖర్చులకు ఉపయోగించాలని ఆ లేఖలో కోరడం అందరినీ కలిచివేసింది.
గ్రామంలో విషాద ఛాయలు - పోలీసుల దర్యాప్తు
ఒకే కుటుంబంలో నలుగురు, ముఖ్యంగా ఇద్దరు చిన్నపిల్లలు మృతిచెందడంతో బంగారెడ్డిపల్లి గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ కుటుంబంలో అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరూ మిగలకపోవడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News