నా పార్టీకి నేనేంటో తెలుసు.. అన్నీ అబద్ధపు ప్రచారాలే: భానుప్రకాశ్ రెడ్డి
ABN , Publish Date - Mar 11 , 2026 | 01:48 PM
తిరుమల పరకామణిలో చోరీ ఇప్పుడే కొత్తగా జరిగినట్లు పెద్ద అక్షరాల్లో వార్తలు రాస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. దీని వెనక తిరుమల హుండీకి కానుకలు రాకుండా చేసే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
తిరుపతి, మార్చి 11: తిరుమల పరకామణి చోరీ కేసుపై బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి(Bhanu Prakash Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..టీటీడీపై జరుగుతున్న ఆరోపణలు, హుండీ కానుకలపై కుట్రలను ఆయన తీవ్రంగా ఖండించారు. పరకామణిలో 2025 జనవరిలో జరిగిన చోరీ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని అప్పుడే అరెస్టు చేసి, కేసులు నమోదు చేసి, బంగారం రికవరీ కూడా చేశారని భాను ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ రోజు సాక్షి పత్రికలోనూ ఈ వార్త ప్రచురితమైందని తెలిపారు. అయితే ఇప్పుడు దాన్ని కొత్తగా జరిగినట్టు పెద్ద అక్షరాల్లో వార్తలు రాయడం వెనుక తిరుమల హుండీకి కానుకలు రాకుండా చేసే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
2023, జూన్ 13న భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు శివశంకర్ అనే విజిలెన్స్ అధికారి.. భక్తుల నుంచి దొంగతనం చేసిన దొంగను ఆలయంలో పట్టుకున్నారని తెలిపారు. ఆ దొంగ నుంచి శివశంకర్ డబ్బులు కొట్టేశారని భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. అతన్ని ప్యారెంట్ డిపార్ట్‌మెంట్‌కు పంపి కరుణాకర్ రెడ్డి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రవికుమార్ ఇష్యూలో సాక్ష్యాలను తారుమారు చేయడంలో శివశంకర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. హుండీలో దొంగతనం చేసిన రవికుమార్‌తో చెట్టుకింద పంచాయితీ చేసి భాగాలు పంచుకున్నారని వ్యాఖ్యలు చేశారు.
టీటీడీలో అవినీతి జరగలేదని తడిబట్టలతో తాను ప్రమాణం చేస్తానని.. కమీషన్లు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా? అని భూమన కరుణాకర్‌రెడ్డికి సవాల్ విసిరారు. తన పార్టీకి తాను ఏమిటో తెలుసన్నారు. నెయ్యి కొరత లేదని, తిరుమలను టార్గెట్ చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు ప్రింట్ చేసిన భగవద్గీత ముందు మాటలో ‘మాట తప్పని.. మడమ తిప్పని’ అని రాసుకున్నారని.. కానీ కంటెంట్ లేని లక్షల పుస్తకాలు గోదాముల్లో పడి ఉన్నాయని సెటైర్ విసిరారు. టీటీడీపై చేసే రాజకీయ ఆరోపణలకు టీటీడీ ఈవో సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. టీటీడీకి ఉన్న క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి తాడేపల్లి ప్యాలెస్ అనకొండలను వదులుతోందని ఆరోపించారు. తిరుమలలో ఆదిశేషుడు ఉన్నారని.. వారి ముందు ఈ అనకొండలు ఏమీ చేయలేవని భాను ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం
ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న
Read Latest AP News And Telugu News