Share News

కూటమికి 499, వైసీపీకి 76.. పరిషత్ ఫలితాలను ప్రకటించిన ఈసీ

ABN , Publish Date - Nov 08 , 2026 | 09:24 PM

ఏపీ వ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు పోటీ జరగగా.. 499 స్థానాలను కూటమి సొంతం చేసుకోగా.. వైసీపీ 76 స్థానాలతో సరిపెట్టుకుంది..

కూటమికి 499, వైసీపీకి 76.. పరిషత్ ఫలితాలను ప్రకటించిన ఈసీ
ap mptc zptc election results

అమరావతి, నవంబర్ 8: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది.


జడ్పీటీసీ ఫలితాల వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. టీడీపీ అత్యధికంగా 406 స్థానాలతో ఘన విజయం సాధించింది. 76 స్థానాల్లో గెలిచి.. వైసీపీ రెండో స్థానం సంపాదించగా.. జనసేన పార్టీ 73 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా 20 జడ్పీటీసీ స్థానాలు దక్కించుకోగా.. సీపీఐ(ఎం) అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక స్థానంతో సరిపెట్టుకుంది. కాగా.. ఆరుగురు స్వతంత్య అభ్యర్థులు విజయం సాధించగా.. ఆప్, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు బెర్తు కూడా దక్కలేదు. కాగా.. నెల్లూరు జిల్లాలో 30 స్థానాలకు గానూ.. టీడీపీ 26 స్థానాల్లో గెలుపొంది విజయ దుందుభి మోగించింది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో 22 స్థానాల చొప్పున గెలవగా.. శ్రీ సత్యసాయి, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 21 స్థానాల చొప్పున గెలుపును కైవసం చేసుకుంది.


ఎంపీటీసీ ఫలితాల వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల పరిధిలోని 7,768 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయ కేతనం ఎగిరించింది. టీడీపీ అత్యధికంగా 4,806 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన పార్టీ 938 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాగా.. వైసీపీ 1,711 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొంది, రెండో స్థానంలో నిలిచింది. 117 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా.. 162 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సీపీఐ(ఎం)15, కాంగ్రెస్ (INC) 9, బీఎస్పీ 3, ఇతర పార్టీలు 7 స్థానాల్లో గెలుపొందాయి. కాగా.. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసి.. ఏకంగా 392 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అయితే.. ఏలూరు జిల్లాలో వైసీపీ అత్యధికంగా 107 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

Updated Date - Nov 08 , 2026 | 09:40 PM