అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడమే మా లక్ష్యం: ఏపీ ఎన్నికల అధికారి
ABN , Publish Date - Oct 16 , 2026 | 09:43 PM
ఆంధ్రప్రదేశ్లో స్థానికసంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారి మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు అక్టోబర్ 30 నాటికి ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అమరావతి, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘అక్టోబర్ 14, 2026 నాటికి ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,75,69,896 కు చేరింది. డ్రాఫ్ట్ జాబితా ప్రచురణ తర్వాత కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 7,62,766. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో గైర్హాజరు, బదిలీ, మరణించిన, నకిలీ ఓటర్ల సంఖ్య 44,89,512 గా ఉంది. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో 50,330 మంది BLOలు, 1,29,662 మంది BLAలు పాల్గొన్నారు. తెలుగుదేశం నుంచి 46,397, వైఎస్సార్సీపీ నుంచి 45,973, బీజేపీ నుంచి 27,583, జనసేన నుంచి 8,988 మంది BLAలు భాగస్వామ్యం వహించారు’ అని ఎన్నికల సంఘ అధికారి వెల్లడించారు.
కొత్త, నమోదు కాని ఓటర్ల కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం: అదనపు సీఈఓ ఎస్. డిల్లీ రావు
అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడమే మా లక్ష్యం. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి మిగిలిపోకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తుది జాబితా ప్రచురణ తర్వాత కూడా ఫారమ్-6 (Form 6) ద్వారా నిరంతరం ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. నవంబర్ 30, 2026 వరకు ప్రతి శనివారం మరియు ఆదివారాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహిస్తాం. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు సహాయం అందించడానికి బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ ప్రత్యేక డ్రైవ్ కోసం 28 మంది జిల్లా ఎన్నికల అధికారులు (DEOలు), 175 మంది EROలు, 3,044 మంది AEROలు, 5,050 మంది BLO సూపర్వైజర్లు మరియు 50,330 మంది BLOలు పాల్గొంటారు. ఓటర్ల నమోదు అనేది ఏడాది పొడవునా జరిగే ప్రక్రియ. కొత్త ఓటర్ల నమోదుకు ఫారమ్-6 దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు లేదా ప్రతిపాదిత చేర్పులపై అభ్యంతరాల కోసం ఫారమ్-7 ఉపయోగించాలి. నివాసం మార్పు, నమోదు వివరాల సవరణ, డూప్లికేట్ ఓటర్ కార్డు (EPIC) పొందేందుకు మరియు దివ్యాంగుల (PwD) మార్కింగ్ కోసం ఫారమ్-8 దాఖలు చేయాలి. ఓటర్ల జాబితా ఫిర్యాదులు లేదా ఫారమ్-6 సమర్పణలో సహాయం కోసం 1950 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరులో వైసీపీకి గట్టి షాక్
పుంగనూరులో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు: జిల్లా ఎస్పీ
For More AP News And Telugu News