Share News

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయితే కొత్త ఓటర్ల జాబితాతో, లేకపోతే ప్రస్తుత జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు
Andhra Pradesh Local Body Elections

Andhra Pradesh Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. ఏపీ హైకోర్టు విధించిన ఆరు వారాల గడువులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎన్నికల ఆలస్యానికి తావులేకుండా ముందుకు వెళ్లాలని ఆదేశించింది.

ఓటర్ల జాబితా, 'సర్ (S.I.R)' ప్రక్రియ

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R)' ప్రక్రియ పూర్తయితే, కొత్తగా రూపొందించిన సమగ్ర ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ నోటిఫికేషన్ సమయానికి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పూర్తి కాకపోతే, ప్రస్తుత పాత ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వైసీపీ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు- సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు

వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 'ఎన్యూమరేటర్లకు, కేంద్ర ప్రభుత్వానికి లేని ఇబ్బంది వైఎస్సార్‌సీపీకి ఎందుకు వస్తోంది?' అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలను కావాలనే వాయిదా వేయించాలనే దురుద్దేశం ఈ పిటిషన్‌లో కనిపిస్తోందని, ఇది ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.

34 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు - ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ను కొట్టివేసిన కోర్టు, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో నిర్దేశించిన పరిమితి ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించకూడదని పునరుద్ఘాటించింది.

బీసీల డేటా సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను పక్కనబెట్టి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఏ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకున్నారంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రాబోయే కొన్ని రోజుల్లో అధికారిక షెడ్యూల్ విడుదల చేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

డిసెంబరులో పార్లమెంటు ముట్టడి

శ్రీవారికి బంగారు పగడాల హారాల కానుక

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 01:31 PM