బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్
ABN , Publish Date - Apr 10 , 2026 | 08:40 PM
తన కన్నతల్లి వైఎస్ విజయమ్మకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గతంలో నిండు అసెంబ్లీలో తన తల్లి వైఎస్ విజయమ్మను బొత్స సత్యనారాయణ అవమానించారని తెలిపారు.
అనంతపురం, ఏప్రిల్ 10: తన కన్నతల్లి వైఎస్ విజయమ్మకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గతంలో నిండు అసెంబ్లీలో తన తల్లి వైఎస్ విజయమ్మను బొత్స సత్యనారాయణ అవమానించారని తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని నాడు చులకన చేసి మాట్లాడి.. విజయమ్మను నిండు సభలో ఆయన కంటతడి పెట్టించారని చెప్పారు.
ఆ తర్వాత విజయమ్మ ఇంటికి వచ్చి చాలా బాధపడ్డారని వైఎస్ షర్మిల గుర్తు చేసుకున్నారు. అమ్మను ఇంతగా బాధపెట్టిన బొత్స సత్యనారాయణకు ఇలా జరగాల్సిందేనని పేర్కొన్నారు. నిండు సభలో విజయమ్మను అవమానించినందుకు బొత్స ఎంత ఏడ్చినా తక్కువే అని అన్నారు.
శుక్రవారం అనంతపురంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని కోరుతూ సీపీఐ పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ పాదయాత్రలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి జగన్ పేరుతో మావిగన్ సరే.. పులివెందులకు వైఎస్ అవినాష్ పేరుతో ‘అవి గొడ్డలి’ అని పెట్టాల్సిందని వ్యంగ్యంగా అన్నారు.
మావిగన్.. ఎంతసేపు గన్నులు, గొడ్డల్లేనా?..
జగన్ పేరులో గన్ ఉంది.. అవినాష్ పేరులో వినాశనం ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ సిద్ధాంతం ఎంతసేపు నరకాలి.. చంపాలి.. నాశనం చేయాలనే కానీ.. నిర్మించాలి, కట్టాలి అనే ఆలోచన వైసీపీకీ కానీ.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కి కానీ లేదని చురకలంటించారు. మావిగన్.. ఎంతసేపు గన్నులు, గొడ్డల్లేనా? అని వైసీపీ అగ్రనేతలను ఆమె సూటిగా ప్రశ్నించారు. నిర్మించాలనే ఆలోచన ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జలయజ్ఞం పూర్తయ్యేదన్నారు.
అప్పుడు గాడిదలు కాశారా?..
ఐదేళ్లలో రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా కట్టలేదని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో వచ్చిన వెంటనే ప్రజా వేదిక కూల్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతి వద్దు.. మావిగన్ ఏర్పాటు చేస్తారంటూ వైసీపీ అధినేత వైఖరిని ఎండగట్టారు. అమరావతికి మావి గన్ అని మీ పేరు, పులివెందులకు అవినాష్ రెడ్డి పేరు మీద “ఆవి గొడ్డలి అని వైసీపీ అధినేతకు ఆమె సూచించారు. మావిగన్ అద్భుత ఐడియా అయితే.. ఐదేళ్ల అధికారంలో ఉండి గాడిదలు కాశారా? అంటూ వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. మావిగన్ అద్భుతం అయితే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఎందుకు మూడు రాజధానులు అన్నారు?
మావిగన్‌కి తక్కువ ఖర్చు అయితే మూడు రాజధానులు ఎందుకు అన్నారు అంటూ జగన్‌ను షర్మిల నిలదీశారు. ఐదేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? లేక నిద్ర పోయారా? అంటూ జగన్‌పై మండిపడ్డారు. మావిగన్ మీద తమ వైఖరి అడుగుతున్నారని.. ఎవరైనా ఈ జోక్ వింటే బిగ్గరగా నవ్వుతారన్నారు. తమ నవ్వే మావిగన్ మీదున్న అర్థం అని తెలిపారు. మళ్లీ దీనిపై కొత్తగా వైఖరి చెప్పడం అనవసరం అన్నారు.
అమరావతిపై వైఖరి ఇప్పటికే స్పష్టం చేశాం..
అమరావతి మీద కాంగ్రెస్ వైఖరి ఇప్పటికే స్పష్టం చేశామని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో సైతం మద్దతు ఇచ్చామన్నారు. ఈ మద్దతు ఇస్తూనే రాష్ట్రానికి అప్పులు ఇవ్వకండి అని కూడా కేంద్రానికి చెప్పామని వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం కేంద్రం బాధ్యత అని కూడా చెప్పామని తెలిపారు. అలాగే విభజన హామీలు సైతం నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు. అమరావతికి పూర్తి మద్దతు ఇస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సహాయం కావాలన్నా చేస్తామని చెప్పామని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.
కూటమికి దత్తపుత్రిక అంటున్నారు..
మావిగన్ జోక్ అంటే తనను కూటమికి దత్తపుత్రిక అంటున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. జగన్ మాత్రమే బీజేపీకి దత్తపుత్రుడు.. అందుకే మోదీతో ఆయన అక్రమ పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకొనే దమ్ము జగన్‌కి లేదన్నారు. ఎందుకంటే బహిరంగ పొత్తుకు జగన్ ఓటు బ్యాంక్ అనుమతి ఇవ్వదని వివరించారు.
కాలర్ పట్టుకుంటా అని.. వెళ్లి..
మోదీ దత్తపుత్రుడిగా ఇన్నేళ్లు అన్ని బిల్లులకు జగన్ మద్దతు ఇచ్చాడని గుర్తు చేశారు. కాలర్ పట్టుకొని అడుగుతా? అని ప్రధాని మోదీకి దత్తపుత్రుడు అయ్యాడంటూ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో వీళ్ళు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి.. తాము కూడా పెట్టుకున్నట్లు వారికి కనిపిస్తోందన్నారు.
చంద్రబాబుతో పొత్తు ఉండదు..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఏనాడూ అక్రమ పొత్తు పెట్టుకునే పరిస్థితి తమకు లేదని కుండ బద్దలు కొట్టారు. తమది కాంగ్రెస్ పార్టీ అని.. ఇది వైఎస్ఆర్ లెగసీతో ఉన్న పార్టీ అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఐడియాలజీతోపాటు ఆయన లెగసీని తాము మోస్తున్నామన్నారు. మీలాగ మత పిచ్చి బీజేపీకి మద్దతు ఇస్తున్న వాళ్లం తాము కాదని చెప్పారు. వైఎస్ఆర్ ఐడియాలజీకి నిజమైన వారసులం తామేనని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్: కొప్పుల ఈశ్వర్
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
Read Latest AP News And Telugu News