ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:28 AM
శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం ఆందోళనకు దారితీసింది. కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
అనంతపురం జిల్లా, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): శింగనమల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి(Bandaru Shravani) ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం ఆందోళనకు దారితీసింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
అసలేం జరిగిందంటే.?
ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి వెళ్లారు. దుండగులను గమనించిన ఎమ్మెల్యే అనుచరులు.. వెంటనే కారులో ఉన్నవారిని వెంబడించేందుకు యత్నించారు. ఇంతలో ఆ కారు అతివేగంతో వెళ్లిపోయింది. ఆ కారు AP 39 KX 0986 అనే నంబర్ కలిగిఉందని వారు గుర్తించారు. వివరాలను ఆరా తీయగా.. గుంటూరుకు చెందిన మొగిలి ఆదిలక్ష్మి పేరిట రిజిస్టర్ అయిన్నట్లు తెలుస్తోంది.
వరుస ఘటనలు..
అయితే ఇటీవల కొన్ని నెలలుగా ఇదే తరహాలో తమ నివాస ప్రాంతంలో క్షుద్రపూజలు జరుగుతున్నాయని, దీనివల్లే తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక శింగనమల నియోజకవర్గానికి చెందిన ఒక అసమ్మతి నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. ఆమెను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని వారు ఆరోపించారు.
పోలీసుల చర్యలు..
ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను త్వరగా గుర్తించాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Read Latest Telangana News And AP News And Telugu News