పూలరైతుకు ధరాఘాతం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:22 PM
శుభముహూర్తాలు వచ్చినా పూల ధరల్లో మార్పు కనిపించడంలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
గుడుపల్లె(అనంతపురం): శుభముహూర్తాలు వచ్చినా పూల ధరల్లో మార్పు కనిపించడంలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కుప్పం ప్రాంతంలో రైతులు ఎక్కువగా పూలను సాగు చేస్తారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పాటు ఖర్చు కూడా తక్కువ. దీంతో ఎక్కువమంది వీటి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. బంతి, చేమంతి, కనకాంబరం, రోజా, లిల్లీ, మల్లె, సంపెంగ, కాగడా తదితర పూలను సాగుచేస్తున్నారు. కుప్పం మార్కెట్‌కు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ వ్యాపారులు వచ్చి పూలను కొనుగోలు చేస్తుంటారు. ఈసారి బంతి, చామంతి, రోజా పూల ధరలు బాగా తగ్గిపోయాయి.
కిలో ధర రూ.10 పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత ఖర్చు కూడా రావడంలేదని వాపోతున్నారు. మూడు నెలుగా ధరలు పెరగకపోవడంతో కొందరు రైతులు తోటలను పశువుల మేతగా వదిలివేస్తున్నారు. మరి కొందరు పూలను కోసి వాహనాల్లో కుప్పం మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడ వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ బయట పారబోసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ధరల తీరుపై వైరాగ్యంతో మరికొందరు పంటను ట్రాక్టర్ ద్వారా దున్ని ఇతర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 15వ తేది తర్వాత పెళ్లిళ్ల ముహుర్తాలు ఎక్కువగా ఉంటాయని, ధరలు పెరుగుతాయని ఎదురుచూసినా రైతులకు భంగపాటు ఎదురవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు
Read Latest Telangana News and National News