వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:12 AM
వాట్సాప్ వెబ్ సర్వీసులు పనిచేయట్లేదని కొందరు నెట్టింట ఫిర్యాదు చేశారు. ఉదయం వేళ వెబ్ సర్వీసుకు కనెక్ట్‌కాలేక ఇబ్బంది పడ్డామని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సా్ప్ వెబ్ ఫీచర్ పనిచేయట్లేదంటూ పలువురు యూజర్లు నెట్టింట గగ్గోలు పెట్టారు. లాగిన్ కాలేకపోతున్నామని కొందరు, చాట్స్ సింక్ అవ్వట్లేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. తమకే ఈ సమస్యా? లేదా ఇతరులూ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, నేడు ఉదయం 9.00 గంటల సమయంలో పలువురు యూజర్లు ఈ సమస్యను ప్రస్తావించారు. ఆ తరువాత కొంత సేపటివరకూ క్రమక్రమంగా ఫిర్యాదుల సంఖ్య పెరిగింది.
ఇక ఎక్స్ వేదికగా కూడా అనేక మంది ఫిర్యాదులు చేశారు. గంట నుంచి వెబ్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా కుదరట్లేదని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ముఖ్యంగా భారతీయ యూజర్ల నుంచి ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఉదంతంపై అటు మెటా, ఇటు వాట్సాప్ ఇంకా స్పందించలేదు.
గతేడాది నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వెబ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. బ్రౌజర్‌లలో చాట్స్ లోడ్ కాక, లాగిన్ కాలేక లక్షల మంది ఇబ్బంది పడ్డారు. మొబైల్ యాప్‌లో ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా వెబ్ సర్వీసులో మాత్రం ఆటంకాలు ఏర్పడ్డాయి. మెటా అంతర్గత వ్యవస్థలు లేదా క్లౌడ్ ఏపీఐల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆటంకాల కారణంగా ఫోన్, వెబ్‌సర్వర్‌లతో కనెక్ట్ కాదని అంటున్నారు.
ఇక కొందరి బ్రౌజర్‌ల కేష్‌కు సంబంధించిన సమస్యలు, వీపీఎన్‌తో ఆటంకాలు, ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం వంటివి కూడా వెబ్ సర్వీసుకు ఆటంకాలు కలిగిస్తాయి.
ఈ వార్తలూ చదవండి:
మేధో కార్మికుల్లో అసంతృప్తి రేగితే.. నందన్ నీలేకని హెచ్చరిక
మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్