Share News

మేధో కార్మికుల్లో అసంతృప్తి రేగితే.. నందన్ నీలేకని హెచ్చరిక

ABN , Publish Date - Feb 20 , 2026 | 10:46 PM

మేధో కార్మికుల్లో తమ ఉపాధిపై అభద్రత పెరిగితే కృత్రిమ మేధపై వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని హెచ్చరించారు. బాధ్యతాయుత ఏఐ వినియోగంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

మేధో కార్మికుల్లో అసంతృప్తి రేగితే.. నందన్ నీలేకని హెచ్చరిక
Nandan Nilekani AI warning

ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధను (AI) ఒక అవకాశంగా కాక తమ ఉపాధికి ముప్పుగా వైట్ కాలర్ వర్కర్లు (మేధో శ్రామికులు) భావిస్తే తీవ్ర వ్యతిరేకత మొదలవుతుందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని (Nandan Nilekani) హెచ్చరించారు. ఆంత్రొపిక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు డేరియో అమోడీతో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రామిక వర్గాల (బ్లూ కాలర్) నుంచి ప్రపంచీకరణకు ఎదురవుతున్న వ్యతిరేకతను ఈ సందర్భంగా నందన్ నీలేకని ప్రస్తావించారు. బ్లూ కాలర్ వర్కర్లలో చెలరేగిన అసంతృప్తితో ప్రపంచీకరణ చిన్నాభిన్నమయ్యే స్థాయిలో ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. కృత్రిమ మేధను మేధో కార్మికులు భవిష్యత్తులో ఇదే స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్థవంతమైన, ప్రభావశీలమైన ఏఐ అప్లికేషన్ల రూపకల్పనపై తక్షణం దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.


ఏఐతో అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ డీప్ ఫేక్‌ల ముప్పు, పెరుగుతున్న ఇంధన భారం కారణంగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని కూడా నందన్ నీలేకని అన్నారు. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించకపోతే ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి పెల్లుబుకుతుందని అన్నారు. ఏఐ రేసులో పురోగమనం కంటే తిరోగమనం వేగంగా జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. ఏఐతో ముడిపడిన ప్రతి ఒక్కరూ మానవాళికి ఉపయోగకరమైన రీతిలో ఈ సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ఇందులో విఫలమైతే సమాజంలో తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఏఐ వినియోగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే ప్రత్యేక స్థితిలో భారత్ ఉందని కూడా నందన్ నీలేకని అన్నారు. ఆధార్, యూపీఐ వ్యవస్థలు ఇచ్చిన అనుభవం ఇందుకు దోహదపడిందని చెప్పారు.


ఈ వార్తలూ చదవండి:

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్

భారత్‌పైనే ఆశలన్నీ.. ఏఐ సమ్మిట్‌కు క్యూకడుతున్న టెక్ సంస్థలు

Updated Date - Feb 20 , 2026 | 10:56 PM