భారత్‌పైనే ఆశలన్నీ.. ఏఐ సమ్మిట్‌కు క్యూకడుతున్న టెక్ సంస్థలు
ABN , Publish Date - Feb 11 , 2026 | 06:12 PM
త్వరలో భారత్‌లో జరగనున్న ఏఐ సమ్మిట్‌కు సిలికాన్ వ్యాలీ అతిరథ మహారథులు అందరూ క్యూకడుతున్నారు. మరి భారత్‌కు టెక్ కంపెనీలు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: పటిష్టమైన ఐటీ రంగం, భారీ స్థాయిలో ఇంటర్నెట్ వినియోగదారులున్న భారత్‌పై ప్రస్తుతం టెక్ దిగ్గజాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో జరగనున్న ఏఐ సమిట్‌లో పాల్గొనేందుకు అమెరికా సిలికాన్ వ్యాలీకి చెందిన అతిరథ మహారథులు అందరూ హాజరవుతున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఆంథ్రొపిక్ సీఈఓ డారియో అమాడే, గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, మెటా చీఫ్ ఏఐ సైంటిస్టు క్రిస్టియానో తదితరులు ప్రధాని మోదీ ప్రసంగానికి హాజరుకానున్నారు (AI Summit 2026- Opportunities in India).
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి నాలుగు రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. ప్రధాని మోదీ ఈ ఏఐ సదస్సును స్వయంగా ప్రారంభిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి ఏఐ సంస్థలు అమిత ప్రాధాన్యం ఇవ్వడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆదాయంపై కన్ను
ఏఐ అభివృద్ధి కోసం టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇందుకు తగినట్టు ఆదాయం పెంచుకోవాలన్న ఒత్తిడి కంపెనీలపై పెరుగుతోంది. ఇప్పటికే ఏఐ సంస్థలు పలు ఏఐ ఉత్పత్తులను సిద్ధం చేశాయి. భారత ఐటీ కంపెనీల్లో తమ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఏఐ కంపెనీలు నమ్ముతున్నాయి. దీంతో, భారత్‌కు క్యూకడుతున్నాయి.
మారుతున్న మార్కెట్ పరిస్థితులు
ఏఐకి మంచి డిమాండ్ ఉన్న మార్కెట్‌లల్లో అమెరికా, చైనాల తరువాతి స్థానం భారత్‌దే. అమెరికా కంపెనీలకు ఇప్పటికే చైనా తలుపులు దాదాపుగా మూసుకుపోయాయి. దీంతో, వాటి దృష్టి భారత్‌వైపునకు మళ్లింది. భారతీయుల సగటు ఏఐ వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడి జనాభా దృష్ట్యా టెక్ కంపెనీలకు కళ్లు చెదిరే ఆదాయం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో, ఆంథ్రొపిక్, ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన టెక్ కంపెనీలు అన్నీ భారత్‌లో కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయి.
ఇక దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు భారత్ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఏఐ హార్డవేర్ సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ప్రముఖ జీపీయూ చిప్‌ల తయారీ సంస్థ ఎన్‌విడియా భారత్‌వైపు దృష్టిసారించింది.
డేటాపై ఆశలు
ఏఐ సాంకేతికతకు డేటా అత్యంత కీలకం. ఈ డేటా ఆధారంగానే ఏఐ తనని తాను మెరుగుపరుచుకుంటుంది. వాస్తవప్రపంచంలోని సమాచారం ఆధారం ఏఐకి శిక్షణ ఇస్తేనే అవి రాటుదేలతాయి. జనాలకు ఉపయోగపడే రీతిలో సేవలు అందిస్తాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాలో 20 శాతం భారత్ నుంచే వస్తోంది. భారత్‌లో ఏకంగా 700 మిలియన్‌ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. పలు రకాల భాషలు మాట్లాడే వారు, విభిన్న నేపథ్యాలు ఉన్న వారు భారత్‌లో భారీ స్థాయిలో ఉంటారు. ఇక్కడ ఏఐ వర్క్‌ఫోర్స్ ప్రపంచంలోనే అత్యధికం. ఇంతమంది నిత్యం తమ కార్యకలాపాల ద్వారా సృష్టించే డేటాతో ఏఐ మోడల్స్‌కు తిరుగులేని స్థాయిలో శిక్షణ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో, ఏఐ కంపెనీలకు భారత్ ప్రధాన కార్యక్షేత్రంగా మారింది. ఇక్కడ నెగ్గుకొస్తే చాలు.. ఎంతటి విస్తృతస్థాయిలో అయినా ఏఐ సాంకేతికతను నిర్మించొచ్చన్న అభిప్రాయం టెక్ వర్గాల్లో ఉంది. ఇలా అన్ని రకాలుగా ఏఐ అభివృద్ధికి కీలకంగా మారిన భారత్‌కు టెక్ కంపెనీలు పరుగులు పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.