Share News

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:09 PM

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగవుతాయని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ సులేమాన్ తెలిపారు. రాబోయే రోజుల్లో పనివిధానం భారీ మార్పులకు లోనవుతుందని చెప్పారు.

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్
Microsoft AI Chief Suleyman

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌లోని (Microsoft) ఏఐ విభాగం చీఫ్ ముస్తాఫా సులేమాన్ (Mustafa Suleyman) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమే మేధ కారణంగా మరో 12 నెలల్లో మేధోశ్రామికులు చేసే వైట్ కాలర్ ఉద్యోగాలు చాలా వరకూ కనుమరుగు అవుతాయని అన్నారు (White Collor Jobs). కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ప్రతి ఉద్యోగం రిస్క్‌లో ఉందని పేర్కొన్నారు. వ్యాపార సంస్థల కోసం మైక్రోసాఫ్ట్ సిద్ధం చేసిన ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ (Professional Grade-AGI) మోడల్ గురించి మాట్లాడుతూ సులేమాన్ ఈ కామెంట్స్ చేశారు.

తాము రూపొందించిన ఈ ఏఐ మోడల్‌‌తో నిపుణులు చేయగలిగిన దాదాపు అన్ని పనులనూ చేయించొచ్చని అన్నారు. మేధో శ్రామికులు చేసే రొటీన్ పనులను చేసే ఏఐ సాధనాలను ఈ ఏజీఐ మోడల్ ఆధారంగా తాము అందించగలుగుతుందని అన్నారు.


రాబోయే రోజుల్లో పని విధానం భారీ మార్పులకు లోనవుతుందని సులేమాన్ అంచనా వేశారు. లాయర్లు, అకౌంటెంట్లు.. ప్రాజెక్టు మేనేజర్లు, మార్కెటర్లు.. ఇలా కంప్యూటర్‌ ముందు కూర్చుని చేసే ప్రతి ఉద్యోగం (వైట్ కాలర్) రిస్క్‌లో ఉన్నట్టేనని అభిప్రాయపడ్డారు. రాబోయే 12 నుంచి 18 నెలల్లో ఈ విధులన్నీ మనుషుల అవసరం లేకుండా ఏఐ ఆటోమేటిక్‌గా చేస్తుందని తెలిపారు. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ కొత్త మోడల్స్‌ను రూపొందించడం మరింత సులువు అవుతుందని సులేమాన్ అన్నారు. వివిధ సంస్థల అవసరాలకు తగినట్టు ప్రత్యేక మోడల్స్‌ను ఈజీగా సిద్ధం చేయొచ్చని అన్నారు. రాబోయే రెండు, మూడేళ్లల్లో భారీ సంస్థల్లో కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ఏఐ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ఇప్పటికే ఆంథ్రొపిక్ సంస్థ క్లాడ్ వర్క్ అనే ఏఐ ఉత్పత్తిని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. టెకీలు చేసే కోడింగ్‌ను మరింత సులువుగా, వేగంగా చేసేలా సంస్థ దీన్ని రూపొందించింది. దీంతో, స్టాక్ మార్కెట్‌లు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఎస్ఏఏఎస్ కంపెనీల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


ఈ వార్తలూ చదవండి:

భారత్‌పైనే ఆశలన్నీ.. ఏఐ సమ్మిట్‌కు క్యూకడుతున్న టెక్ సంస్థలు

ఎలాన్ మస్క్‌ జోస్యం! మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్లు

Updated Date - Feb 12 , 2026 | 05:10 PM