Share News

ఎలాన్ మస్క్‌ జోస్యం! మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్లు

ABN , Publish Date - Feb 06 , 2026 | 09:08 PM

భూమిపై కంటే అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు సులభమని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. మరో మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకుంటుందని చెప్పారు.

ఎలాన్ మస్క్‌ జోస్యం! మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్లు
Elon Musk on Data Centers in Space

ఇంటర్నెట్ డెస్క్: రాబోయే మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్ల (Space AI Data Centers) ఏర్పాటు ఊపందుకుంటుందని టెక్ ఆంత్రప్రెన్యూస్ ఎలాన్ మస్క్ (Elon Musk) జోస్యం చెప్పారు. నేలపై కంటే మరింత తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయొచ్చని అన్నారు. అవి అంతరిక్షంలో మరింత ప్రభావశీలంగా పనిచేస్తాయని కూడా వివరించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో తాజాగా మస్క్ ఈ కామెంట్స్ చేశారు.

భూమిపై డేటా సెంటర్లను విస్తరించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని ఎలాన్ మస్క్ వివరించారు. ఇందులో ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయని అన్నారు. ‘అంతరిక్షంలో రాత్రి-పగలు తేడాలు ఉండవు. వాతావరణ సమస్యలు ఉండవు. భూమిపై సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే శక్తిలో 30 శాతం వాతావరణం కారణంగా వృథా అవుతోంది. అంతరిక్షంలో సోలార్ ప్యానెల్స్ ఆధారిత డేటా సెంటర్లకు ఈ సమస్యలు ఉండవు. అవి మరింత మెరుగ్గా పనిచేస్తాయి. అక్కడ సోలార్ ప్యానెల్స్‌ ఐదు రెట్లు ఎక్కువ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. భూమిపై డేటా సెంటర్లల్లో రాత్రిళ్లు బ్యాటరీల అవసరం ఉంటుంది. అంతరిక్షంలో ఈ సమస్య ఉండదు. ఆ మేరకు ఖర్చు తగ్గుతుంది’ అని అన్నారు.


అంతరిక్షంలో ఏఐ విస్తరణకు కావాల్సిన స్థాయిలో జీపీయూ చిప్ సెట్స్ పనిచేస్తాయా? అన్న ప్రశ్నకు కూడా మస్క్ సమాధానమిచ్చారు. తొలి పరీక్ష దశలను విజయవంతంగా దాటిన జీపీయూలు ఆ తరువాత చాలా కాలం పాటు ప్రభావశీలంగా పనిచేస్తాయని వివరించారు. పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదని అన్నారు. కాబట్టి, ఈ విషయంలో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా తాను ప్రణాళికలు వేస్తున్నట్టు కూడా మస్క్ తెలిపారు.


ఇవీ చదవండి

మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగు: ఎస్ఏపీ సంస్థ సీఈఓ

ప్రియుడి బండారం బయటపెట్టిన చాట్‌జీపీటీ.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

Updated Date - Feb 06 , 2026 | 09:09 PM