నెయ్యి అంశంపై ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Feb 27 , 2026 | 10:49 AM
ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియం వద్ద నిరసనకు దిగారు.
అమరావతి, ఫిబ్రవరి 27: ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం మొదలైన వెంటనే నిన్న(గురువారం) జరిగిన సంఘటనపై ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ‘నిన్న లడ్డూ ప్రసాదంపై లఘు చర్చ సందర్భంగా తప్పుడు పత్రం చూపించి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాలు సభ సజావుగా జరిగేలా సహకరించాలి’ ఛైర్మన్ అన్నారు. ఛైర్మన్ రూలింగ్‌పై మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలుపగా.. మరింత మాట్లాడి తనను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారా అని ఛైర్మన్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి.. ‘మాకు మీరంటే అపారమైన గౌరవం ఉంది’ అని స్పష్టం చేశారు.
రెండు రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్షం లేకపోవడంతో తమ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రతో నోటీసులు ఇప్పించి.. మంత్రి స్టేట్‌మెంట్ ఇచ్చిన సంఘటనను అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. మార్చి 4వ తేదీన కాకపోతే వరుసగా మూడు రోజులు చర్చకు తాము సిద్ధమని మంత్రి ప్రకటించారు. ప్రతిపక్షం చర్చ చేపట్టాలని చెప్పి పారిపోవడం ఏమిటని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు.. ‘ఇంతటి అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎక్కడా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. నెయ్యి అంశంపై ఎన్ని రోజులైనా చర్చించడానికి తాము సిద్ధమని కూడా మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో.. ఆ పార్టీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఇలా ఛైర్మన్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలపడం ఏంటని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ‘ఛైర్మన్‌కు గౌరవం ఇవ్వటం ఇదేనా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల నిరసనతో సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలోని యూనివర్సిటీలన్నింటినీ భ్రష్టు పట్టించారు.. వైసీపీపై మంత్రి లోకేశ్ ఫైర్
Read Latest AP News And Telugu News