ఇదేం పని రామకృష్ణా.! ఏసీబీ వలలో వీఆర్వో
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:16 PM
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఓ టీ స్టాల్‌లో రైతు ప్రభాకర్‌రెడ్డి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో రామకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డాడు.
భూ సమస్య పరిష్కారానికి లంచం
రూ.30 వేలు తీసుకోగానే పట్టుకున్న ఏసీబీ
తాడిపత్రి(అనంతపురం): తాడిపత్రి పట్టణంలోని ఓ టీ స్టాల్‌లో రైతు ప్రభాకర్‌రెడ్డి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో రామకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డాడు. రామకృష్ణ సజ్జలదిన్నె సచివాలయంలో పనిచేస్తున్నాడు. తాడిపత్రి మండలం ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని ఆవుల తిప్పయ్యపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డికి సర్వే నంబర్ 37బీలో 87 సెంట్ల భూమి ఉంది. దీన్ని రెవెన్యూ అధికారులు మిగులు భూమిగా చూపించారు. దీంతో తన పేరిట ఆన్‌లైన్‌లో ఎక్కించాలని, పాసుపుస్తకం మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు బాధిత రైతు పలుమార్లు విన్నవించారు.
వీఆర్వోను కలవాలని ఇన్‌చార్జి తహసీల్దారు సోమశేఖర్ ఆయనకు సూచించారు. వీఆర్వోను కలవగా, రూ.లక్ష ఇస్తే పని చేస్తామని బేరం పెట్టాడు. పంటలు పండక తాను ఊరు విడిచి తాడిపత్రిలో హమాలీ పనులు చేసుకుంటున్నానని, లంచం ఇవ్వలేనని రైతు బతిమాలినా కరగలేదు. దీంతో రూ.30వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రైతు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు వీఆర్వోకు రూ.30వేలు లంచం ఇచ్చారు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పది నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని బాధిత రైతు నుంచి ఫిర్యాదు వచ్చిందని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో విచారిస్తున్నామని అన్నారు. వీఆర్వో పట్టుబడిన అనంతరం ఇన్‌చార్జ్ తహసీల్దార్ సోమశేఖర్, ఆర్‌ఐ కరుణాకర్ రెడ్డిని విచారించినట్లు తెలిసింది.
ఏడాది కిందట వచ్చి..
వీఆర్వో రామకృష్ణ సొంతూరు యాడికి మండలం రాయలచెరువు. యాడికి సచివాలయం-2లో విధులు నిర్వహించేవాడు. దాదాపు ఏడాది కిందట మ్యుచువల్ బదిలీ చేయించుకుని తాడిపత్రికి వచ్చాడు. అప్పటి నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా పట్టించుకోలేదు. ఏ పనికి వెళ్లినా లంచం తప్పనిసరి అయింది. దీంతో వ్యవహారం ఏసీబీ అధికారుల వరకూ వెళ్లింది. ఏసీబీ దాడుల గురించి తెలియగానే పలువురు బాధితులు నేరుగా తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. ఏసీబీ అధికారులను కలిసేందుకు ప్రయత్నించారు. అధికారులు కేసు దర్యాప్తులో ఉండటంతో కొందరు వెనుదిరిగారు. ఏసీబీ అధికారులు మంచి పనిచేశారు అని పలువురు వ్యాఖ్యానించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మొత్తం అక్రమాలు బయటకు వస్తాయని అన్నారు.
లంచం ఇవ్వలేనని చెప్పినా..
ఆవులతిప్పయ్యపల్లిలో మాకు 87 సెంట్లు భూమి ఉంది. అధికారులు ఆన్‌లైన్‌లో ఎక్కించకుండా, పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా మిగులు భూమి కింద చూపించి, లంచం అడుగుతున్నారు. పది నెలలుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. రూ.లక్ష ఇస్తేగాని ఆన్‌లైన్‌లో ఎక్కించమని అన్నారు. నేను మా ఊరు వదిలి తాడిపత్రిలో హమాలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. మా దగ్గర డబ్బులు లేవు, నాకు అంత స్థోమత లేదని చెప్పాను. వారు వినిపించుకోలేదు. ‘ఎన్నిసార్లు తిరిగినా ఇంతే. ఏం చేస్తే పనిజరుగుతుందో తెలుసుకోవయ్యా..’ అని అన్నారు. అందుకే రూ.30 వేలకు కుదుర్చుకుని వెళ్లిపోయాను. ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాను. వారి సూచనల మేరకు తాడిపత్రికి వచ్చి లంచం ఇవ్వగానే అధికారులు పట్టుకున్నారు.
-ప్రభాకర్ రెడ్డి, రైతు
ఈ వార్తలు కూడా చదవండి:
గుంతకల్లు వరకూ తిరుమల ఎక్స్‌ప్రెస్
ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!
Read Latest Telangana News and National News