Share News

పశుసంవర్ధక రంగంలోకి రండి.. యువతకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:55 AM

యువత సాంకేతిక రంగాలవైపు వెళుతూ పశుసంవర్ధకానికి దూరమవుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని.. అందుకే యువత పశుసంవర్ధక రంగంలోకి రావాలని కోరారు.

పశుసంవర్ధక రంగంలోకి రండి.. యువతకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు
Minister Atchannaidu

అమ‌రావ‌తి, ఏప్రిల్ 30: ఏపీలో సుమారు 25 లక్షల మంది రైతులు పశుసంవర్ధక రంగంపై ఆధారపడి ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం ఉదయం పశుసంవర్ధక మార్గదర్శిని ఈ-మ్యాగజైన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. 2025-26లో ఈ రంగం ద్వారా రూ.1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి కలిగిందని చెప్పారు. యువత సాంకేతిక రంగాలవైపు వెళుతూ పశుసంవర్ధకానికి దూరమవుతున్నారని అన్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని.. అందుకే యువత పశుసంవర్ధక రంగంలోకి రావాలని కోరారు. పాడి పశువులు, కోళ్లు, పందుల పెంపకాన్ని వాణిజ్యపరంగా చేపట్టాలని మంత్రి సూచించారు.


విశాఖలో 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటివరకు 1500 మందికి శిక్షణ ఇచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. అందులో 200 మంది విజయవంతంగా వ్యాపారం ప్రారంభించారన్నారు. ఏప్రిల్ నుంచి ఈ- మ్యాగజైన్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. స్మైల్ వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా అందరికీ చేరుస్తున్నామన్నారు. పశుఆరోగ్యం, పోషణ, మార్కెటింగ్‌పై పూర్తి సమాచారం అందుతుందని తెలిపారు. రైతుల విజయగాథలు, నిపుణుల సూచనలు ఇందులో ఉంటాయన్నారు. సహాయక సిబ్బందికి కూడా ఆధునిక జ్ఞానం అందుతుందని వెల్లడించారు. సేంద్రియ పద్ధతుల్లో పెంపకం చేస్తే సంవత్సరానికి ఒక ఎకరానికి రూ.5 నుంచి రూ.6 లక్షలు సంపాదించవచ్చని తెలిపారు. ‘ప్రతి ఇంటి నుంచి ఒక ఆంత్రప్రెన్యూర్ రావాలి.. అదే మా లక్ష్యం’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 12:34 PM