Share News

Hanumakonda Student: అర్థం కాని కోర్సు.. ఒత్తిడితో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:45 PM

అర్థం కాని చదువుతో సతమతం అవుతున్నానని, ఈ చదువు తనతోకాదని, చెల్లినైనా నచ్చిన కోర్సులో జాయిన్‌ చేయించి మంచిగా చదవించండంటూ తల్లిదండుల్రకు సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటర్‌ విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Hanumakonda Student: అర్థం కాని కోర్సు.. ఒత్తిడితో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Hanumakonda Student

వరంగల్‌ క్రైమ్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అర్థం కాని చదువుతో సతమతం అవుతున్నానని, ఈ చదువు తనతోకాదని, చెల్లినైనా నచ్చిన కోర్సులో జాయిన్‌ చేయించి మంచిగా చదవించండంటూ తల్లితండుల్రకు సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటర్‌ విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అదివారం హనుమకొండలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో చోటు చేసుకుంది. హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్‌ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన మిట్టపల్లి కుమార్‌- కవిత దంపతులు.. వారి పెద్ద కూతురు శివాని(16)ని హనుమకొండలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం జేఈఈ బ్యాచ్‌లో జాయిన్‌ చేశారు.


అయితే శివానికి మాత్రం ఎంసెట్‌ బ్యాచ్‌లో కొనసాగాలని ఉన్నప్పటికీ తల్లిదండ్రుల కోరిక మేరకు జేఈఈ మెయిన్స్‌ కోర్సులో జాయిన్‌ అయింది. ఆమెకు జేఈఈ తరగతులు అర్థం కాకపోవడంతో అదివారం ఉదయం కళాశాల మూడో అంతస్థులోని తరగతి గదిలో ఫ్యాన్‌‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సహచర విద్యార్థిని.. కళాశాల యాజమాన్యానికి సమాచారం చేరవేయడంతో హుటాహుటినా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కాగా, ఇష్టం లేని కోర్సులో ఇమడలేకపోతున్నానని, ఇక చావే దిక్కు.. అని, చెల్లినైనా మంచిగా చదివించండంటూ రాసుకున్న సూసైడ్‌ నోట్‌ మృతురాలి లాకర్‌లో లభ్యమైంది. తండ్రి కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ మచ్చ శివకుమార్‌ తెలిపారు.


విద్యార్థిని శివాని రాసిన సూసైడ్ లేఖలో ఏం ఉందంటే..

మమ్మి..! ‘చెల్లిని బాగా చదివించండి, మంచి కాలేజీలో మంచి గ్రూప్ తీసుకోమను... నా లాగే అర్ధం కాని చదువు వద్దు.. దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగా ఉండండి... కాలేజీలో జాయిన్ చేసేముందు ఎవరినైనా కొంచం అడిగి జాయిన్ చేయండి, చెల్లి నువ్వు కూడా మంచిగా చదువుకోవే.... ఆ చదువు నాకు అర్ధం అవడం లేదు. మీకు చెబితే మీరు అర్ధం చేసుకోవడం లేదు.... నాకు మొత్తం టెన్షన్ ఐతాంది, మైండ్ పోతుంది మీరు చెప్పిన చదువు నాతోని కావట్లేదు, నేను చదువుదాం అనుకున్న చదువుకి మీరు ఒప్పుకుంటలే చివరికి నాకు చావే దిక్కు అయింది... ఏం అర్ధం కాకా మధ్యలో నలిగిపోతున్నా. ఈ సంవత్సరం అంటే ఏదో మీరు ఫీజు కట్టారని ఏదోలా కింద మీద పడి ఉన్నా. ఇగ నాతోని కాదు నేను వెళ్లిపోతున్నా.... నాకు ఇంత తక్కువ మార్కులు రావడం నేను, మీరు తట్టుకోలేరు అందుకే చనిపోతున్నా. అందరూ జాగ్రత్త... మంచిగా ఉండండి.... ఈ ఒక్క సంవత్సరం కూడా మీ కోసమే చదివిన. అయినా నాతోని కావడం లేదు.. ఎంత కష్టపడ్డా ఈ చదువు రావడం లేదు.. అందరూ జాగ్రత్త’ అని విద్యార్థిని శివాని సూసైడ్ నోటులో రాసి చనిపోయింది. ఈ లేఖ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్‌ ఫోకస్‌

డ్రగ్స్‌ కేసుల్లో పబ్బులకు లింకులు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 01:26 PM