Kishan Reddy Open Letter: సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:27 AM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు చేస్తూ సాగింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ పేరుతో రూపొందించిన డాక్యుమెంట్ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వచ్చి స్వయంగా మీకు అందించారు. ఆ సమయంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న దూరదృష్టిని అభినందించినట్లు, తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు ప్రకటించారు. కానీ, 2023 లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో 17 సెప్టెంబర్, 2023 న హైదరాబాద్ నగర శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన మీరు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు మీరు, మీ కుటుంబ సభ్యులైన రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీతో పాటు మీ పార్టీ.. మేనిఫెస్టో అమలు గురించి కానీ, మీరు స్వయంగా ప్రకటించిన 6 గ్యారంటీల అమలు గురించి కానీ ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వీటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా? 2 సంవత్సరాల పాలన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి మీరు అభినందించారు. అంటే, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి గానీ, 6 గ్యారంటీలు ప్రజలకు అందించారా లేదా అనే వాస్తవాలు గానీ మీకు తెలిసినట్లు లేదు.. తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినట్లు కూడా లేదు. కానీ, ఇచ్చిన హామీలు వదిలివేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ, ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్ తో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేలేశారా? లేక గాంధీ భవన్ లో పాతరేశారా? తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మీరు ప్రయోగించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై మిమ్మల్ని అధికారానికి దూరం చేయకుండా మానదు! ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి తగిన గుణపాఠం చెబుతారన్న విషయం గుర్తుంచుకోండి అంటూ కేంద్ర మంత్రి తన బహిరంగ లేఖలో ప్రస్తావించారు.
ఇవీ చదవండి:
T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్