Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ ఆలస్యానికి కారణమిదే..మందకృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 30 , 2025 | 10:14 PM
Manda Krishna Madiga: కాంగ్రెస్ పార్టీలో శాసించే స్థాయిలో మాలలు ఉండబట్టే సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేస్తామని తీర్మానం చేశారని తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా : కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మాలలే పెత్తనం చెలాయిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తేదీన ‘‘లక్ష డప్పులు.. వెయ్యి గొంతుకలు’’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ నాగర్ కర్నూల్ జిల్లాలో ఇవాళ(గురువారం) పర్యటించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కోరుకునే 58 కులాలది ధర్మపోరాటమని.. మాలలది స్వార్థం స్వలాభమని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేస్తామని తీర్మానం చేశారని గుర్తుచేశారు. మాలల ఒత్తిడి వల్ల వర్గీకరణ అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
ఏబీసీడీ ఎస్సీ వర్గీకరణ అమలు కోసమే ‘‘లక్ష డప్పులు.. వెయ్యి గొంతుకలు’’ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఎందుకు ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో శాసించే స్థాయిలో మాలలు ఉండబట్టే సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం లేదని విమర్శించారు. మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ, ప్రధాన మంత్రులు వర్గీకరణకు అనుకూలమేనని గతంలో చెప్పిన ఎందుకు అమలు కావట్లేదని నిలదీశారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సలహాదారులు మాల ఐఏఎస్ అధికారులు కాబట్టే వర్గీకరణ జరగలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒకరికి పదవి అంటారు కానీ అమల్లోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ రెండు కుటుంబాలకే సకల సౌకర్యాలు కాంగ్రెస్ పార్టీ కల్పించిందని మందకృష్ణ మాదిగ విమర్శించారు.