Kavitha Blames Congress: సింగరేణి లాభాల పంపిణీలో అన్యాయం.. కవిత ఫైర్
ABN , Publish Date - Sep 23 , 2025 | 02:50 PM
కాంగ్రెస్ హయాంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని కవిత చెప్పుకొచ్చారు. కార్మికులకు బిచ్చమేసేలాగా కాంగ్రెస్ లాభాల వాటాను ప్రకటించిందని దుయ్యబట్టారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 23: సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సింగరేణి సొమ్మును దోచుకొని కొత్త గనులు ఏర్పాటు చేయకుండా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. లాభాల వాటాలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని చెప్పుకొచ్చారు. కార్మికులకు బిచ్చమేసేలాగా కాంగ్రెస్ లాభాల వాటాను ప్రకటించిందని దుయ్యబట్టారు.
ఒక్కొక్క కార్మికుడికి లక్ష రూపాయల మేరకు నష్టం జరిగిందన్నారు. సింగరేణి కార్మికులను కాపాడుకుంటేనే తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా, గూండా రాజకీయం నడుస్తుందా, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుకు సింగరేణి కార్మికులే కీలకమని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.
సింగరేణి లాభాల పంపిణీలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు సంవత్సరాలుగా సింగరేణి లాభాలను తక్కువగా చూపుతున్నారన్నారు. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి లాభాలు తీసుకవస్తే వారి నోట్లో మట్టికొట్టుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో లాభాల వాటాపై ముఖ్యమంత్రి పునఃసమీక్షించాలని సూచించారు. కార్మికులకు అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు
Read Latest Telangana News And Telugu News