HYDRA: హైడ్రా పేరిట మోసం.. రూ.50 లక్షలు వసూలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 07:46 AM
ఓ వ్యక్తితో కలిసి డిజిటల్ మీడియా ప్రతినిధులు హైడ్రా పేరు చెప్పి కొందరు రూ.50 లక్షలు వసూలు చేయడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకుంటే బుద్ధభవన్‌లోని సంస్థ కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
- ఓ వ్యక్తితో కలిసి డిజిటల్ మీడియా ప్రతినిధుల దందా
- పోలీసులకు సంస్థ ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: ఓ వ్యక్తితో కలిసి డిజిటల్ మీడియా ప్రతినిధులు హైడ్రా(HYDRA) పేరు చెప్పి కొందరు రూ.50 లక్షలు వసూలు చేయడంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకుంటే బుద్ధభవన్‌లోని సంస్థ కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఆక్రమణలు, కబ్జాలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. హైడ్రా అధికారులు బంధువులు, మిత్రులు, సన్నిహితులు.. మీ పనులు చేయిస్తామంటూ కొందరు వ్యక్తులు ప్రజలను మభ్యపెట్టి.. అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపోవద్దని సూచించారు.

‘వెలుగు’లోకి మోసం
తుక్కుగూడ మునిసిపాలిటీ మంఖాల్ గ్రామం పరిధిలో వర్టెక్స్ నిర్మాణ సంస్థ లే అవుట్ అభివృద్ధి చేసింది. సూరం చెరువును ఆక్రమించడంతో పాటు కొత్తకుంటలో మట్టిపోసి బాక్స్ డ్రైన్ నిర్మించిందనే ఫిర్యాదు హైడ్రాకు అందింది. విచారణ చేపట్టిన హైడ్రా నిర్మాణ సంస్థపై రెండు కేసులు నమోదు చేసింది. తమ భూమిని ఆక్రమించి వర్టెక్స్ సంస్థ రోడ్డు నిర్మించిందని చైతన్యరెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశాడు.

ఇరు పక్షాలతో అధికారులు మాట్లాడారు. ఈ క్రమంలో ఫిర్యాదుకు సంబంధించి ఓ వ్యక్తికి రూ.50 లక్షలు ఇచ్చానని చెప్పాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన హైడ్రా.. హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి తొలగించిన ఓ వ్యక్తి, అందరి జీవితాల్లో ‘వెలుగు’లు నింపుతామనే ఓ డిజిటల్ మీడియా రిపోర్టర్, మరో డిజిటల్ మీడియా ప్రతినిధి కలిసి డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు ఆ ముగ్గురిపై పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News