Film Actor Sivaji: శివాజీ వ్యాఖ్యలపై వాయిస్ ఆఫ్ ఉమెన్ ఫైర్.. వెంటనే క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 06:07 PM
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వాయిస్ ఆఫ్ ఉమెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మా అసోసియేషన్‌కు వాయిస్ ఆఫ్ ఉమెన్ శుక్రవారం లేఖ రాసింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది.
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ (Film Actor Sivaji) మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే వాయిస్ ఆఫ్ ఉమెన్ ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్‌కు వాయిస్ ఆఫ్ ఉమెన్ ఇవాళ(శుక్రవారం) లేఖ రాసింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది.
దండోర సినిమా ప్రమోషన్ ప్రెస్‌మీట్‌లో శివాజీ బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన చేస్తున్నామని పేర్కొంది. టీఎఫ్‌ఐలో పనిచేస్తున్న 100+ మహిళా నిపుణుల తరపున తాము ఈ లేఖ రాస్తున్నామని తెలిపింది. శివాజీ ప్రసంగంలో మహిళల గురించి అవమానకరంగా మాట్లాడారని చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదని, తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందే, ప్రభావితం చేసే వ్యక్తులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది వాయిస్ ఆఫ్ ఉమెన్.
శివాజీ ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. ఇది BNS 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించేలా ఉందని... ఇది శిక్షార్హమైన నేరమని పేర్కొంది. స్త్రీలను అవమానించడం, వారి వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపింది. నటుడు శివాజీ వెంటనే బహిరంగంగా, భేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించింది. లేకపోతే తాము చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో మహిళలు బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటం కూడా అంతే ఆందోళనకరమైనదని చెప్పుకొచ్చింది వాయిస్ ఆఫ్ ఉమెన్.
నటీమణులు నిధి అగర్వాల్, సమంత ఇటీవల పాల్గొన్న ఈవెంట్స్‌లో కూడా కొందరు అసభ్యంగా తాకడం క్షమించరాని నేరమని మందలించింది. మహిళలపై ఇలాంటి చర్యలు జరుగుతుంటే పోలీసులు నైతిక బాధ్యత వహించి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. మహిళల భద్రత, గౌరవానికి భంగం కలిగినప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఎలా..? అని నిలదీసింది. ఈ విషయాల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి స్పష్టమైన జవాబుదారీతనం, చర్యను తాము కోరుతున్నామని వాయిస్ ఆఫ్ ఉమెన్ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
ఆ ఛార్జీలు రద్దు చేయాలి.. టీజీఈఆర్సీకి నీటిపారుదల శాఖ లేఖ
For More TG News And Telugu News