Share News

CM Revanth Reddy: విద్యాశాఖ సమూల ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:55 PM

రాష్ట్రంలో ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారని తెలిపారు.

CM Revanth Reddy: విద్యాశాఖ సమూల ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
CM Revanth Reddy

హైదరాబాద్: విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ తెలిపారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతోపాటు పేదరిక నిర్మూలన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ(బుధవారం) తెలంగాణ నూతన విద్యా విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు.


విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుంది..

రాష్ట్రంలో ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారని తెలిపారు. వారిలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొన్నారు. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. విద్యా శాఖకు రూ.21 వేల కోట్లు కేటాయిస్తే.. అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుందని వ్యాఖ్యానించారు.


పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం..

పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని నొక్కిచెప్పారు. అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను కోరారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం అధికారులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని సూచించారు.


స్కూల్ ఎడ్యుకేషన్‌‌లో లోపాలు ఉన్నాయి..

స్కూల్ ఎడ్యుకేషన్‌‌లో లోపాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. 11 వేల ప్రైవేట్ స్కూల్స్‌‌లో 34 లక్షల మంది విద్యార్థులు చదివితే.. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్య కోసం తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్‌బీఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు చెప్పారు. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలని ఆయన సూచించారు. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే.. రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా తాను సిద్ధమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

Updated Date - Sep 17 , 2025 | 03:59 PM