TG News: 30 గంటల తల్లి నిరీక్షణకు తెర.. కొడుకును కాపాడిన రెస్క్యూ బృందాలు
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:09 PM
ఐదుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక తల్లి హృదయ విదారక వేదనకు రెస్క్యూ బృందాలు స్వస్తి పలికాయి. వరదల్లో చిక్కుకున్న తన కుమారుడు జంగం స్వామి కోసం తల్లి లక్ష్మి 30 గంటల పాటు ఎదురుచూసింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన స్వామి భారీ వర్షాల కారణంగా సుడిగుండం వరద నీటిలో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లిగుండె.. ఒక్కసారిగా బద్దలైంది. తన కొడుకు తిరిగి వస్తాడో.. రాడో.. అన్న భయంతో ఆవేదన చెందింది. అధికారుల కాళ్ల మీద పడుతూ.. తన కొడుకుని రక్షించాలని వేడుకుంది.
అయితే.. స్వామితో పాటు మరో నలుగురు వ్యక్తులు మానేరులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించడానికి రెస్క్యూ బృందం ఎంత ప్రయత్నం చేసిన ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే.. 30 గంటలు గడిచిపోయాయి. వారు మానేరుపైనే ఉన్నారు. వారు తిరిగి వస్తారా.. అనే సందేహం అందరిలో మొదలయ్యింది. దీంతో ఇదంతా చూస్తున్న తల్లి ఆవేదన కోపం రూపంలో బయటకు వచ్చింది. నాయకులు తన కొడుకును రక్షించలేకపోతే వారు నాయకులుగా ఉండి ఎందుకని మండిపడ్డింది. తన కుమారుడిని రక్షించడానికి మళ్లీ ప్రయత్నించాలని ఆమె అధికారులను కోరింది. దీంతో రెస్క్యూ బృందం కొన్ని గంటలు శ్రమించి.. స్వామితో పాటు మానేరులో చిక్కుకపోయిన వారిని రక్షించింది. దీంతో ఆ తల్లి 30 గంటల నిరీక్షణకు తెరపడింది. కొడుకు తిరిగి రావడంతో.. తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తనను రక్షించిన రెస్క్యూ బృందంకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇది రెండవ జీవితామని స్వామి పేర్కొన్నారు.
మరోపక్క తీవ్రంగా దెబ్బతిన్న మెదక్ జిల్లాలో కూడా.. రెస్క్యూ బృందాలు తమ నైపుణ్యాన్ని చాటుకున్నాయి. ఓ గర్భిణీ స్త్రీ వరదలో చిక్కుకుని ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతుంది. అది గమనించిన రెస్క్యూ బృందాలు వెంటనే ఆమెను రక్షించి.. ఆసుపత్రికి తరలించారు. ఆసుత్రిలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. NDRF బృందం సకాలంలో రక్షించి, ఆసుపత్రిలో చేర్చడం వల్ల తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన అవసరమైన క్షణాల్లో ఈ రెస్క్యూ బృందాలు కీలక పాత్రను పోషిస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు.
నిర్మల్ జిల్లా వరదల్లో కూడా రెస్క్యూ బృందాలు కీలక పాత్ర పోషించాయి. అక్కడ NDRF బృందం పెరుగుతున్న వరద నీటిలో చిక్కుకున్న శంకర్ నాయక్‌ను విజయవంతంగా రక్షించింది. ప్రత్యేక పడవను ఉపయోగించి, రక్షకులు శంకర్‌ను సురక్షితంగా తీసుకువచ్చారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 250 కుటుంబాలను బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. నిర్మల్‌ను మహారాష్ట్రకు కలిపే ప్రధాన మార్గం మూసివేయబడింది. అయితే.. ఈ వరదలో ప్రభావంలో అన్ని కథలకు సుఖాంతం కాలేదు. విషాదకరమైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. బెస్త సత్యం, యాద గౌడ్ అనే ఇద్దరు వ్యక్తులు రాజ్‌పేట వంతెనను దాటడానికి ప్రయత్నించినప్పుడు కొట్టుకుపోయారు. ఆ ఇద్దరు ఆచూకి ఇప్పటి వరకు లభించలేదు.
గత రెండు రోజులుగా 50 సంవత్సరాలలో అత్యధిక వర్షపాతం నమోదైన కామారెడ్డి జిల్లాలో #RealHeroesగా ఉద్భవించిన పోలీసులు చేసిన సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఏమాత్రం సంకోచించకుండా, ప్రాణాలను పణంగా పెట్టి, వరదలో చిక్కుకున్న 10 మందిని పోలీసులు రక్షించారు. ఉధృతంగా ప్రవహించే.. ఛాతీ లోతు నీటిని ఒకే తాడును ఉపయోగించి దాటారు. వారిలో పిల్లలు కూడా ఉన్నారు. వారిని వారు భుజాలపై మోసుకెళ్లారు. ఈ ఘటనతో పోలీసులు అందరి హీరోలు అనే పేరు సంపాదించారు. పలువురు నాయకులు, ముఖ్యనేతలు పోలీసులను అభినందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు