Share News

Phone Tapping Case: కొత్త సిట్‌ విచారణ.. కీలక అంశాలపై ఫోకస్

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:35 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Phone Tapping Case: కొత్త సిట్‌ విచారణ.. కీలక అంశాలపై ఫోకస్

హైదరాబాద్, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తాజాగా కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌లో 9 మంది అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఇవాళ (శనివారం) నుంచి కీలక విచారణను ప్రారంభించారు. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ గడువును మరో వారం రోజుల పాటు సుప్రీం కోర్టు పొడిగించింది. ఇందులో భాగంగా ప్రభాకర్ రావును పోలీసులు మళ్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టనున్నారు.


జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రస్తుతం ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసును సమగ్రంగా పరిశీలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సిట్‌ను నియమించగా.. ఆ బృందంతో నిన్న (శుక్రవారం) హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసు పురోగతి, విచారణ విధానం, సాంకేతిక అంశాలు, ఆధారాల సేకరణ వంటి పలు కీలక విషయాలపై సిట్ అధికారులకు సీపీ స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.


ఈ సూచనల మేరకు శనివారం ఉదయం నుంచే పలువురు సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. అధికారులు ఈ వారం రోజుల పాటు ప్రభాకర్ రావును నిరంతరంగా ప్రశ్నించనున్నారు. సిట్ విచారణను సమర్థవంతంగా నిర్వహించేందుకు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక రూమ్‌ను కేటాయించారు. అక్కడే కస్టోడియల్ విచారణ జరగనుంది.


ప్రభాకర్ రావును ఈ నెల 25వ తేదీ వరకు కస్టడీలో ఉంచి విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతి లభించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులను కూడా సిట్ అధికారులు పిలిపించి, ప్రభాకర్ రావు ఎదుటే ప్రశ్నిస్తున్నారు. గతంలో వారు ఇచ్చిన స్టేట్‌మెంట్లు, సాంకేతిక ఆధారాలు, డేటా విశ్లేషణ ఆధారంగా ప్రభాకర్ రావును సమగ్రంగా విచారిస్తున్నారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా భావిస్తున్న ప్రణీత్ రావుతో కలిపి కూడా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఆదేశాలు, అమలైన విధానం, రాజకీయ నేతలు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్ అంశాలపై స్పష్టత కోసం అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


ఈ వారం రోజుల విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు, మరికొందరి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీలోకి సినీనటి ఆమని.. ముహూర్తం ఫిక్స్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 12:54 PM