New Telangana Ministers: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ముగ్గురికీ లక్కీ ఛాన్స్
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:53 PM
తెలంగాణ కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికి అవకాశం దక్కింది. వీరిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు రేవంత్ ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణలో (Telangana Cabinet Expansion) కొత్తగా ముగ్గురికి అవకాశం దక్కింది. వీరిలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు రేవంత్ ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో (New Telangana Ministers) ఇవాళ (ఆదివారం) రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త మంత్రులకు ఈరోజు సాయంత్రం శాఖల కేటాయింపు చేసే అవకాశాలు ఉన్నాయి.
నూతన మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకి అభినందనలు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రనాయక్‌కు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రనాయక్
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రనాయక్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రామచంద్రనాయక్ తెలిపారు. డోర్నకల్ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సహచర ఎమ్మెల్యేలకు రామచంద్రనాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని రామచంద్రనాయక్ పేర్కొన్నారు.
నేతలకు బుజ్జగింపులు...
ఈసారి తెలంగాణ కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్‌లో మంత్రి పదవులు ఆశించి పలువురు నేతలు భంగపడ్డారు. వారిని అగ్రనేతలు బుజ్జగిస్తున్నారు. పదవులు రాలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్‌గౌడ్, వేం నరేందర్‌రెడ్డి సర్దిచెబుతున్నారు. అయితే మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసానికి కాంగ్రెస్ పెద్దలు చేరుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై సుదర్శన్‌రెడ్డి మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం రాలేదని అసంతృప్తిలో ఆయన ఉన్నారు. ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డితో సహా ఇతర నేతల ఇళ్లకు మీనాక్షి నటరాజన్, నేతలు వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి
అది ఈటల స్టాండ్.. బీజేపీ స్టాండ్ కాదు
హైదరాబాద్‌లో 4 ట్రాన్సిట్ కారిడార్లు..
Read Latest Telangana News And Telugu News