Share News

Telangana: హైదరాబాద్‌లో 4 ట్రాన్సిట్‌ కారిడార్లు..

ABN , Publish Date - Jun 08 , 2025 | 06:34 AM

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేషనల్‌ ట్రాన్సిట్‌ ఓరియెంటేషన్‌ డెవల్‌పమెంట్‌(టీవోడీ) విధానాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జనసాంద్రత, వాహనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్సిట్‌ కారిడార్లను ఏర్పాటు చేయనుంది.

Telangana: హైదరాబాద్‌లో 4 ట్రాన్సిట్‌ కారిడార్లు..

నాగోల్‌, అమీర్‌పేట, పటాన్‌చెరు, జవహర్‌ నగర్‌లో అమలుకు చర్యలు

500-800 మీటర్లలో ఏర్పాటు

ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టే ప్రయత్నం

మౌలిక వసతులపై తగ్గనున్న ఒత్తిడి

తదుపరి దశల్లో ఇతర నగరాలకు చాన్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ లాంటి నగరాలు, వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌, కాలుష్యానికి చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేషనల్‌ ట్రాన్సిట్‌ ఓరియెంటేషన్‌ డెవల్‌పమెంట్‌(టీవోడీ) విధానాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జనసాంద్రత, వాహనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్సిట్‌ కారిడార్లను ఏర్పాటు చేయనుంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి కార్యాలయాలకు నడిచి వెళ్లడం లేదా.. ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకునేలా ప్రోత్సహించనుంది. తద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి.. ట్రాఫిక్‌, వాతావరణ కాలుష్య సమస్యలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. టీవోడీ విధానంలో కీలక ప్రాంతాల్లో 500-800 మీటర్లలో ట్రాన్సిట్‌ కారిడార్లను అభివృద్ధి చేస్తారు. దాంతోపాటు.. నివాస ప్రాంతాల్లోనే ఉద్యోగావకాశాలు, నిత్యావసరాలు లభించే కేంద్రాలు, పాఠశాలలు, పార్కులు, వినోద కేంద్రాలను ప్రోత్సహించాలని పురపాలక శాఖ భావిస్తోంది. ట్రాన్సిట్‌ కారిడార్లలో పార్కులు, సైకిల్‌ లేన్లు, పాదచారుల బాటలను ఏర్పాటు చేస్తారు. తొలిదశలో అమీర్‌పేట, నాగోల్‌, పటాన్‌చెరు, జవహర్‌నగర్‌లలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. తదుపరి దశలో హైదరాబాద్‌తోపాటు.. వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ నగరాల్లోనూ ఈ కారిడార్లను ఏర్పాటు చేస్తారు. దీనిపై ఇంకా సమగ్ర నివేదికలు తయారు కావాల్సి ఉందని అధికారులు వివరించారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:34 AM