Chamal Kiran Kumar Reddy: గ్రూప్-1పై కేటీఆర్ వ్యాఖ్యలు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్..
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:30 PM
నిరుద్యోగల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులు వారి తల్లిదండ్రుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. గ్రూప్-1 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకూడదని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పరీక్షల్లో 563 అభ్యర్థుల దగ్గర రూ.3కోట్ల లెక్కన తీసుకొని ప్రభుత్వం వాళ్లను ఎంపిక చేసిందని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు.
నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకులు రావద్దన్న సదుద్దేశంతో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని గుర్తుచేశారు. 563 మంది అభ్యర్థుల తల్లిదండ్రులందరికీ మూడు కోట్లు పెట్టే స్థోమత ఉంటుందా..? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కి ఓటేయని ప్రజలు బాధపడుతూ ఉండాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల మీద బీఆర్ఎస్ నేతలకు ప్రేమ లేదని పేర్కొన్నారు.
రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై కేటీఆర్ నిందలు వేస్తున్నారని చామల ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్‌కి.. గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి బుద్ది చెప్పాలని అన్నారు. నిన్న(శనివారం) కేటీఆర్ మాట్లాడిన మాటల్లో.. ప్రజలకు నిజం తెలియాలంటే 563 గ్రూపు-1 అభ్యర్థుల తల్లిదండ్రులు స్పందించాలని ఆయన కోరారు. ఇవాళ(ఆదివారం) తాను మాట్లాడిన తర్వాత తక్షణమే వారెక్కడుంటే అక్కడ నుంచి వీడియోలు చెయ్యాలని చామల పిలుపునిచ్చారు. తమ ఆర్థిక స్థోమతను వీడియోలో వివరించాలని కోరారు. ఇది పార్టీ సమస్య కాదని.. మన బిడ్డల సమస్యని స్పష్టం చేశారు. రోడ్డు మీదికి రావాలి.. ప్రెస్‌మీట్‌లు పెట్టాలని సూచించారు. లేని సమస్యను సృష్టిస్తున్న కేటీఆర్‌ను చెప్పు దెబ్బలు కొట్టాలని ఎంపీ చామల ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..