Minister Uttam Kumar : కేసీఆర్, హరీష్ రావుల బండారం బట్టబయలైంది : మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:44 PM
కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అందుకే హరీష్ రావు ఏకంగా జ్యుడిషియల్ కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నివేదికతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల బండారం బట్టబయలైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అక్రమాలకు పాల్పడిందో జ్యుడిషియల్ కమిషన్ విచారణలో బయటపడిందని తెలిపారు.
అందుకే తేలు కుట్టిన దొంగలా.. హరీష్ రావు మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శించారు. హరీష్ అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ.. న్యాయ వ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయాయని స్పష్టం చేశారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణలో కేసీఆర్ పాత్ర ఏమిటో.. హరీష్ రావు చేసిన ఘనకార్యాలేమిటో తేలిపోయిందన్నారు.
కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అందుకే హరీష్ రావు ఏకంగా జ్యుడిషియల్ కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. విచారణ కమిషన్ తేల్చిన విషయాలపైనా, ఇచ్చిన నివేదికపైన అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, చట్ట సభలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అందుకే.. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఫార్మ్ హౌస్‌లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీస్‌లో అల్లుడి యాక్షన్ అంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు అసెంబ్లీకి వచ్చి, చేసిన తప్పులు ఒప్పుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్