Minister Tummala: ఆ పంటల కొనుగోలుకు కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలి: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Oct 27 , 2025 | 07:59 PM
తెలంగాణ రాష్ట్రంలో పెసర, మినుము పంటలను వందశాతం వరకు, సోయాబీన్‌ను 50శాతం వరకు MSP కింద కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా ప్రైస్ సపోర్టు స్కీమ్‌లో చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఇవాళ(సోమవారం) వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రైస్ సపోర్టు స్కీమ్ (Price Support Scheme) (PSS) కింద పంటల కొనుగోలుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పెసర, మినుము పంటలను వందశాతం వరకు, సోయాబీన్‌ను 50శాతం వరకు MSP కింద కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు మంత్రి తుమ్మల. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా ప్రైస్ సపోర్టు స్కీమ్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ధాన్యంపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..
మరోవైపు... ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకి మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు. రోడ్లు, కొనుగోలు కేంద్రాల వద్ద నేలపై ధాన్యం ఉంచవద్దని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డుకు, జిన్నింగ్ మిల్లులకు తీసుకురావడానికి ముందు పత్తిలో తేమశాతం 12 శాతం మించకుండా చూసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. 12 శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు. మార్కెట్ యార్డు, జిన్నింగ్ మిల్లులకు రాకముందే తేమ శాతం చెక్ చేసుకోవాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమశాతం ఎక్కువ ఉన్నా పత్తి పంట కొనాలని కేంద్ర ప్రభుత్వంపై తాము ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌కు నిన్న(ఆదివారం) లేఖ రాశామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం పత్తి రైతులకు గరిష్ట మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు పత్తి రైతులు తేమ శాతం 12 శాతం మించకుండా చూసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు
ఈ వార్తలు కూడా చదవండి..
మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల పునరుద్ధరణ: మంత్రి ఉత్తమ్
Read Latest Telangana News And Telugu News