Share News

Mahesh Kumar Goud: గుడ్ న్యూస్.. కార్పొరేషన్ పోస్టులపై కీలక ప్రకటన.!!

ABN , Publish Date - Dec 10 , 2025 | 02:21 PM

లావాదేవీలలో భాగంగానే కవిత - బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కవిత కారణంగా బీఆర్ఎస్ కబ్జాలు అన్ని బయటకు వస్తున్నాయని విమర్శించారు.

Mahesh Kumar Goud:  గుడ్ న్యూస్..  కార్పొరేషన్ పోస్టులపై కీలక  ప్రకటన.!!
Mahesh Kumar Goud

హైదరాబాద్, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌లు భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. టీపీసీసీ నియామకం జరిగిన రోజే డీసీసీలతో మినహా అన్ని పోస్టులు రద్దు అవుతాయని తెలిపారు. ఈనెల చివరి నాటికి కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. లంబాడాలకు నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలిపారు. ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. ఇవాళ(బుధవారం) గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు మహేశ్ కుమార్ గౌడ్.


గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూడలేక మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఊహించని స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చారు. పేరుగాంచిన కంపెనీలతోనే తమ ప్రభుత్వానికి ఒప్పందాలు జరిగాయని వివరించారు. ముందు కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ కావడంతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే ,రాహుల్ గాంధీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రాలేకపోయారని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము తమకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. శ్వేతపత్రం అంటే బీఆర్ఎస్‌కు భయమని ఎద్దేవా చేశారు మహేశ్ కుమార్ గౌడ్.


బీఆర్ఎస్ కబ్జాలు బయటకు వస్తున్నాయి..

ఫ్యూచర్ సిటీ భవిష్యత్‌లో గొప్పగా ఉంటుందని తెలిపారు. లావాదేవీలలో భాగంగానే కవిత - బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కవిత కారణంగా బీఆర్ఎస్ కబ్జాలు అన్ని బయటకు వస్తున్నాయని విమర్శించారు. కవిత ఆరోపణలపై విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తాను టీపీసీసీగా చాలా సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆర్గనైజేషన్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. మీడియాలోనే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని చెబుతున్నారని.. అప్పుడే మంత్రి పదవి ఇస్తున్నారంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు. లోక్‌సభలో ప్రియాంక గాంధీ చాలా బాగా మాట్లాడారని ప్రశంసించారు మహేశ్ కుమార్ గౌడ్.


నెహ్రూపై బీజేపీది అసత్య ప్రచారం..

పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కోసం వందేమాతరాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాహర్ లాల్ నెహ్రూను విమర్శిస్తూ జీవితంలో అతిపెద్ద పొరపాటు చేశారని మండిపడ్డారు. నెహ్రూ వల్లే దేశం వెనకబడిందని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లాలంటే బయపడ్డారని ఎద్దేవా చేశారు. 1965లో ఇందిరాగాంధీ ఆర్ట్స్ కాలేజీకి వచ్చారని... 60 సంవత్సరాల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆర్ట్స్ కాలేజీకి వెళ్లడం చరిత్రగా నిలిచిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2025 | 02:50 PM