KTR Slams Revanth: వారి ఆగ్రహంతో రేవంత్, కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:15 PM
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు పథకాన్ని రేవంత్ బంద్ చేస్తారంటూ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 27: వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొడంగల్ నుంచి పోటీ చేయరంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (శనివారం) కేటీఆర్ సమక్షంలో కొడంగల్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డిపై రగిలిపోతున్నారన్నారు. కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమని వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు పథకాన్ని రేవంత్ బంద్ చేస్తారంటూ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి గురించి అందరి కంటే ఎక్కువ కొడంగల్ ప్రజలకే తెలుసన్నారు.
కొడంగల్‌కు తిరుపతి రెడ్డే సీఎం..
రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ భూములను.. తొండలు గుడ్లు పెట్టని భూములంటూ రేవంత్ అవమానించారని మండిపడ్డారు. ‘కొడంగల్ రేవంత్ రెడ్డి జాగీరా.. కొడంగల్‌కు రేవంత్ చక్రవర్తి కాదు. కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్, కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది. తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. కొడంగల్‌కు తిరుపతి రెడ్డి ముఖ్యమంత్రి. వార్డు మెంబర్ కూడా కాని తిరుపతి రెడ్డికి.. కలెక్టర్, ఎస్పీ వంగి వంగి దండాలు పెడుతున్నారు. అన్నదమ్ములు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్, తిరుపతి రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారు’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
మూసీకి అన్ని కోట్లా..?
కమీషన్ల కోసమే రేవంత్ మూసీ ప్రాజెక్టు చేస్తానంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రూ.16వేల కోట్లతో అయిపోయే దానికి లక్షా 50 వేల కోట్లు ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. ప్లాన్ ప్రకారమే ఎంజీబీఎస్ బస్టాండ్‌ను ముంచారని ఫైర్ అయ్యారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయపెట్టేందుకే ఒకేసారి 15 గేట్లు తెరిచారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఎంజీబీఎస్ బస్టాండ్ మునిగిందని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో పొంగులేటి, మెగా కృష్ణారెడ్డికి దోచి పెడుతున్నారని ఆరోపించారు. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఫైర్
వాళ్లకు ఒకలా... మాకు ఒకలానా... మండలిలో ‘కాఫీ’పై వార్
Read Latest Telangana News And Telugu News