MGBS: అలర్ట్ కాక అవస్థలు.. నీట మునిగిన ఎంజీబీఎస్
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:22 PM
మూసీ ఒడ్డున ఉన్న మహాత్మగాంధీ బస్‌స్టేషన్(MGBS) నీట మునిగింది. వరద నీరు స్టేషన్‌లోకి చేరుకోవడంతో జిల్లాలకు వెళ్లాల్సిన, వివిద ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలపాటు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ సిటీ: మూసీ ఒడ్డున ఉన్న మహాత్మగాంధీ బస్‌స్టేషన్(MGBS) నీట మునిగింది. వరద నీరు స్టేషన్‌లోకి చేరుకోవడంతో జిల్లాలకు వెళ్లాల్సిన, వివిద ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలపాటు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. వరదను అంచనావేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వ విభాగాలు విఫలమయ్యాయి.

ఐటీ కారిడార్ అతలాకుతలం..
నగరంలో ఒకవైపు భారీగా వర్షాలు, మరోవైపు దసరా పండుగకు ఊరెళ్తున్న ప్రయాణికులు, షాపింగ్‌ల కోసం వచ్చిన జనంతో సిటీలో ఎక్కడ చూసినా జనసమ్మర్థంతో పాటు.. రోడ్లపై వాహనాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు నరకం చూశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సైబరాబాద్ ఐటీ కారిడార్ అతలాకుతలం అయింది. సుమారు 26 ప్రధాన రహదారుల్లో వర్షపు నీళ్లు నిలిచిపోయి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

సమస్య తీవ్రతను గుర్తించిన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి, జాయింట్ సీపీ(ట్రాఫిక్) డాక్టర్ గజరావు భూపాల్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. గంగారం, మైహోం మంగళ రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాలను పర్యవేక్షించారు. అదేవిధంగా శేరిలింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి వచ్చే మార్గంలో హెచ్‌సీయూ గేట్ నంబర్2, డొయెన్స్ కాలనీ, హెరిటేజ్ జంక్షన్, విప్రో జంక్షన్, బొటానికల్‌గార్డెన్, టి-గ్రిల్ జంక్షన్ ప్రాంతాల్లో వరదనీరు భారీగా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డీసీపీ, ఏసీపీలకు సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాల్సిన నంబర్లు
- జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్- 040 - 2111 1111
- హైడ్రా - 1070
- ట్రాఫిక్ పోలీస్- 9010203626
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News